వైసీపీ అధినేత జగన్‌ను, ఆయన అధికారంలో ఉండగా కీలకంగా వ్యవహరించిన నాయకులను కేంద్ర దర్యాప్తు బృందాలతో విచారించాలన్నది ప్రస్తుత కూటమి సర్కారులో ముఖ్య పాత్ర పోషిస్తున్న టీడీపీకి మనసు నిండా ఉన్న కోరిక. అయితే.. ఇది అనుకున్నంత ఈజీయేనా? ప్రధాని మనవాడే అయినా.. ఈ కోరిక నెరవేరుతుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. దీనికి కారణం.. ఆ ఊరుకు.. ఈఊరు ఎంత దూరమో.. ఈ ఊరుకు .. ఆ ఊరు కూడా అంతే దూరం అన్నట్టుగా మోడీ-జగన్‌ల రాజకీయం కొనసాగు తోంది!
విషయం ఏంటి?
ప్రస్తుతం జగన్‌పై ఉన్న అక్రమాస్తుల కేసులు 11 ఏళ్లు అయినా.. ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు . పైగా ఆయా కేసుల్లో బెయిల్‌పై ఉన్న జగన్.. ఇప్పటి వరకు మళ్లీ జైలు ముఖం కూడా చూసింది లేదు. అంతేకాదు.. అక్రమాస్తుల కేసులు.. ఎప్పుడు విచారణకు వస్తాయో కూడా తెలీదు. జడ్జిల మార్పులు, కోర్టుల మార్పులతోనే ఈ కేసులు నడుస్తున్నాయి. మరోవైపు.. సొంత బాబాయి వివేకానందరెడ్డి దారుణ హత్య విషయంలోనూ అలానే జరుగుతోంది. ఏడో సంవత్సరం వచ్చినా.. ఈ కేసు ఎక్కడిదక్కడే ఉండిపోయింది.
టీడీపీ ఆశ ఇదీ..
ఈ నేపథ్యంలో జగన్‌పై మరో కీలక కేసు నమోదు చేయాలన్నది సహజంగానే రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న టీడీపీకి ఉంటుంది. ఈ నేపథ్యంలో దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ మద్యం కుంభకోణం మాదిరిగానే.. ఏపీ మద్యం కుంభకోణం కేసును కేంద్రం పరిశీలించాలని కోరుకుంటోంది. ఇదే.. తాజాగా ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు నోటి నుంచి వచ్చిన మాట. ఇదేమంత వ్యక్తిగత విషయం కాదు. పైగా ఎంపీ లావు ఆ రేంజ్‌లో జగన్‌పై కేసును కదిపే సీన్‌కూడా లేదు. ఇది అటు పార్టీలోనూ.. ఇటు రాష్ట్ర సర్కారులోనూ.. కీలకమైన వ్యవహారం.
సో.. చాలా వ్యూహాత్మకంగానే ఎంపీ లావు పార్లమెంటులో ప్రస్తావించారు. మరి ఇది సాధ్యమేనా? జగన్‌పై టీడీపీ కోరిక నెరవేరుతుందా? మద్యం కుంభకోణంలో జగన్ పై ఈడీ, సీబీఐ దర్యాప్తు సాధ్యపడేనా? అంటే.. కాకపోవచ్చనే చెప్పాలి. ఎందుకంటే.. డిల్లీలో జరిగిన ఘటనకు-ఏపీ ఘటనకు మధ్య పోలిక లేదు. పైగా.. ఢిల్లీలో బీజేపీకి రాజకీయ ప్రయోజనాలు, అధికార ప్రయోజనాలు రెండు ఉన్నాయి. ఏపీ విషయానికి వస్తే.. కేవలం పొత్తు పార్టీ మాత్రమే. సో.. ఇక్కడ జగన్‌పై చర్యలు తీసుకుంటే.. వెంటనే లబ్ధి పొందేది.. ఏ పార్టీ? అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి.. మోడీ అంత సాహసం చేస్తారని కానీ.. జగన్‌పై చర్యలు తీసుకుంటారని కానీ.. ఊహించేందుకు అవకాశం లేదని టీడీపీ అనుకూల మీడియానే చెప్పడం గమనార్హం.