చంద్ర‌బాబుకు ‘ఆద‌ర‌ణ’ జోష్ .. !

ఏపీ సీఎం చంద్ర‌బాబు చేప‌డుతున్న వినూత్న ప‌థ‌కాలు.. కార్య‌క్ర‌మాలు ఆయ‌న‌తోపాటు రాష్ట్రంలో పార్టీకి, ప్ర‌భుత్వానికి కూడా జోష్ పెంచుతున్నాయి. ఇప్ప‌టికే చేప‌ట్టిన కార్య‌క్ర‌మాలు.. ఇస్తున్న పింఛ‌న్లు, ఉచిత గ్యాస్ సిలిండ‌ర్లు వంటివి స‌ర్కారు గ్రాఫ్‌ను పైపైకి తీసుకువెళ్లాయి. ఇక‌, అన్నా క్యాంటెన్ల నిర్వ‌హ‌ణ‌తో స‌ర్కారు దూకుడుకు మ‌రిన్ని మంచి మార్కులు సైతం ప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా ప్ర‌జ‌ల నుంచి రెండు ర‌కాల డిమాండ్లు వినిపిస్తున్నాయి.

1) కులాల వారీగా వృత్తుల‌ను ప్రోత్స‌హించేందుకు ప్ర‌భుత్వం సాయం చేయ‌డం. 2) ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా రుణాల‌ను మంజూరు చేయడం. ఈ రెండు విష‌యాలు కూడా ప్ర‌జ‌ల మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. త‌ర‌చుగా టీడీపీ నాయ‌కులు నిర్వహిస్తున్న ప్ర‌జాద‌ర్బార్‌లోనూ ఈ విష‌యాలపై విన‌తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా ప్ర‌భుత్వం ఆద‌ర‌ణ ప‌థ‌కంపై దృష్టి పెట్టింది. వృత్తుల్లో ఉన్న వివిధ సామాజిక వ‌ర్గాల‌కు సాయం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

2014-19 మ‌ధ్య ఆద‌ర‌ణ ప‌థ‌కాన్ని అప్ప‌టి టీడీపీ ప్ర‌భుత్వం అమ‌లు చేసింది. ఏయే వృత్తుల్లో ఉన్న వారికి ఆయా వృత్తుల వారీగా సాయం అందించింది. ప‌నిముట్లు సైతం కొనిపెట్టింది. ఈ కార్య‌క్ర‌మానికి అప్పట్లో మంచి స్పంద‌న కూడా వ‌చ్చింది. ల‌క్ష‌లాది మంది వృత్తులు చేసుకునే వారికి ప్ర‌భుత్వం రూ. కోట్ల‌ను ఖ‌ర్చు పెట్టి వారికి అవ‌స‌ర‌మైన ప‌నిముట్లు, ప‌రిక‌రాలు, కార్లు కూడా అందించింది. కొన్నింటికి రుణాన్ని స‌మ‌కూర్చ‌గా.. మ‌రికొన్నింటిని నేరుగానే అందించింది.

ఇప్పుడు ఆ ప‌థ‌కాల‌నే ప్ర‌జ‌లు కోరుకుంటున్నారు. దీంతో ఇప్పుడు ఆద‌ర‌ణ‌-2 ప‌థ‌కాన్ని తిరిగి అమ‌లు చేయాల‌ని భావిస్తోంది. త్వ‌ర‌లోనే దీనిపై స‌మ‌గ్ర ప్రాజెక్టును రూపొందించి.. ల‌బ్ధిదారుల‌ను ఎంపిక చేయా ల‌ని నిర్ణ‌యించింది. త‌ద్వారా మెజారిటీ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చడంతోపాటు.. గ‌తంలో అమ‌లు చేసిన ప‌థ‌కాన్ని కొన‌సాగించ‌డం ద్వారా ఓటు బ్యాంకును సైతం సుస్థిరం చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. ఉగాది సంద‌ర్భంగా దీనిని ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.