బోరుగ‌డ్డ.. స‌మాజానికి ప్ర‌మాద‌క‌రం: హైకోర్టు

వైసీపీ నాయ‌కుడు బోరుగ‌డ్డ అనిల్ కుమార్‌కు మ‌రో ఉచ్చు బిగిసుకుంది. తాజాగా హైకోర్టు ఆయ‌న‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది. ‘తాము క‌ళ్లుమూసుకుంటే.. ఇంకా ఆడిస్తారు’ అంటూ.. బోరుగడ్డ త‌ర‌ఫు న్యాయ‌వాదిని ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. సోష‌ల్‌ మీడియాలో సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల‌ను ఉద్దేశించి గ‌తంలో బోరుగ‌డ్డ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. బండ బూతుల‌తో విరుచుకుప‌డ్డారు. ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రించారు. ఇళ్ల‌లోని మ‌హిళ‌ల‌ను కూడా కించ‌ప‌రిచారు. దీనిపై ఏపీ పోలీసులు కేసు న‌మోదు చేసి.. అరెస్టు చేశారు. ఈ క్ర‌మంలో కొన్నాళ్లు రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో కూడా అనిల్ గ‌డిపారు.

అయితే.. త‌న త‌ల్లికి చెన్నైలో ఆప‌రేష‌న్ జ‌రిగింద‌ని.. ఆమెకు తాను ఒక్క‌డినే.. అండ‌గా ఉన్నాన‌ని..త‌న త‌ల్లి బాధ్య‌త‌ల‌ను చూసుకోవాల్సి ఉంద‌ని పేర్కొంటూ.. హైకోర్టును ఆశ్ర‌యించి గ‌తంలో బోరుగ‌డ్డ బెయిల్ తెచ్చుకున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే.. ఇలా ఆయ‌న పెట్టుకున్న బెయిల్ పిటిష‌న్‌, దీనికి సంబందించి ఆయ‌న స‌మ‌ర్పించిన డాక్ట‌ర్ స‌ర్టిఫెకెట్ల‌ను ప‌రిశీలించిన పోలీసులు.. ఇవి న‌కిలీవ‌ని తేల్చారు. దీంతో వారు హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ పిటిష‌న్ విచార‌ణ‌లో ఉండ‌గానే.. బెయిల్ గ‌డువు ముగిసిపోయింది. ఇంత‌లో త‌న‌కు బెయిల్ పొడిగించాల‌ని మ‌రోసారి బోరుగ‌డ్డ కోర్టును ఆశ్ర‌యించారు.

దీనిపైనాకోర్టు విచార‌ణ చేసింది. కానీ, పోలీసులు బ‌ల‌మైన ఆధారాల‌ను స‌మ‌ర్పించ‌డంతో బెయిల్ పొడిగించ‌డం కుద‌ర‌ద‌ని.. పేర్కొంది. అంతేకాదు..ఎక్క‌డున్నా స‌రే.. విమానంలో వ‌చ్చి.. జైలు అధికారుల ముందు లొంగిపో్వాల‌ని ఆదేశించింది. దీంతో బోరుగ‌డ్డ జైలు అధికారుల ముందు లొంగిపోయారు. కానీ, ఆయ‌న‌పై పోలీసులు న‌మోదు చేసిన న‌కిలీ డాక్ట‌ర్ స‌ర్టిఫెకెట్ కేసు స‌హా.. హైకోర్టును త‌ప్పుదోవ ప‌ట్టించార‌న్న కేసులు మాత్రం విచార‌ణ‌లో ఉన్నాయి. తాజాగా వీటిపై విచార‌ణ జ‌రిపిన కోర్టు.. బోరుగ‌డ్డ వంటి వ్య‌క్తులు స‌మాజానికి ప్ర‌మాద‌క‌ర‌మ‌ని.. ఇలాంటివారిని ప్ర‌త్యేకంగా చూడాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వ్యాఖ్యానించింది.

తప్పుడు డాక్ట‌ర్ స‌ర్టిఫికెట్‌ సమర్పించి మధ్యంతర బెయిల్ పొందిన వైనంపై విచారణ నివేదికలను సీల్డ్ కవర్లో కోర్టు ముందు ఉంచాలని పోలీసులనున్యాయస్థానం ఆదేశించింది. అదేవిధంగా నిర్దేశించిన సమయంలోపు జైలు అధికారుల ముందు ఎందుకు హాజరుకాలేదో వివరణ ఇవ్వాలని బోరుగడ్డ అనిల్ త‌ర‌ఫున వాద‌న‌లు వినిపించిన న్యాయ‌వాదిని కూడా కోర్టు ఆదేశించింది. దీనిపై ప్ర‌త్యేకంగా పిటిష‌న్ వేయాల‌ని.. కేసు న‌మోదు చేయాల‌ని ఆదేశించ‌డం గ‌మ‌నార్హం. ఇదిలావుంటే.. ప్ర‌స్తుతం బోరుగ‌డ్డ రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో ఉన్న విష‌యం తెలిసిందే.