ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సభ్యులకు మరోసారి వేతనాలు పెంచింది. రెండేళ్ల కిందట ఒకసారి వేతనాలు పెంచిన కేంద్రం.. తాజాగా మరోసారి 24 శాతం మేరకు వారికి వేతనాలు పెంచుతూ.. ఉత్తర్వులు జారీ చేసింది. ద్రవ్యోల్బణం ఆధారంగా ఈ వేతనాలు పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. అంతేకాదు.. పెంచిన వేతనాలు.. గత ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. అంటే.. ప్రస్తుతం పెంచిన వేతనాలకు సంబంధించిన ఏడాది బకాయిలను వచ్చే నెల 1వ తేదీ వేతనంతో కలిపి ఇవ్వనున్నారు. దీంతో ఎంపీలకు చేతినిండా డబ్బు అందనుంది.
ఎంతెంత పెంచారు?
గతంలో 2022లో ఎంపీ వేతనం 80 వేలు ఉండగా.. అప్పట్లో లక్షరూపాయలకు పెంచారు. ఇప్పుడు 24 శాతం పెంచడంతో.. ఈ వేతనం లక్షా 24 వేలకు పెరిగింది. దీంతో ఒక్కొక్క ఎంపీకి.. సభకు వెళ్లినా.. వెళ్లకపోయినా.. నెలకు 1.24 లక్షల చొప్పున వేతనం బ్యాంకు ఖాతాల్లో పడనుంది. అదేవిధంగా సభకు హాజరైతే.. ఇచ్చే రోజు వారి భత్యం రూ.2000 ను కూడా పెంచారు. ఇది రూ.2500లకు చేరింది. అంటే.. సభ్యులు పార్లమెంటు జరిగిన సమయంలో సభకు హాజరైతే.. రోజుకు అదనంగా రూ.2500 అందనుంది. ఇది కూడా.. గత ఏడాది నుంచి లెక్కగట్టి బకాయిలు ఇవ్వనున్నారు.
ఇక, ప్రతి ఆరు మాసాలకు ఇచ్చే కన్వీనియెన్స్ బిల్లులను ఏకంగా 100 శాతానికి పెంచారు. ప్రస్తుతం ఇది రూ.35000 ఉండగా.. ఇక నుంచి రూ.70000లకు చేరుతుంది. ఇది కూడా గత ఏప్రిల్ 1 నుంచే అమలు కానుంది. అదేవిధంగా కారు డ్రైవర్ అలవెన్సు, పెట్రోల్ అలవెన్సు, ఫోన్ చార్జీలను కూడా 100 శాతం పెంచారు. ఇక, మాజీ పార్లమెంటు సభ్యులకు ఇస్తున్న పింఛను ను సైతం కేంద్రం సవరించింది. ఇది 25 వేల రూపాయలు ఉంది. దీనిని 24 శాతం చొప్పున పెంచడంతో ఇది 31 వేలకు చేరింది. దీనిని కూడా గత ఏడాది ఏప్రిల్ నుంచి లెక్కించి బకాయిలను వచ్చే నెల 1వ తేదీ నుంచి చెల్లించనున్నారు. దీంతో మొత్తంగా ఎంపీలకు భారీ ఎత్తున నగదు చేతికి చేరనుంది.