కేసీఆర్ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయాలి: పెరిగిన సెగ‌

బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ వ్య‌వ‌హారం అంద‌రికీ తెలిసిందే. రాష్ట్రంలో 2023లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆయ‌న ప్ర‌భుత్వం కోల్పోయారు. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌లు ఆయ‌న‌కు గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గంలో బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. కానీ, 15 మాసాలుగా కేసీఆర్‌.. అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్‌, ఇంటికే ప‌రిమితం అవుతున్నారు. ఒకే ఒక్క‌సారి గ‌త ఏడాది జ‌రిగిన బ‌డ్జెట్ స‌మావేశాల రోజు స‌భ‌కు వ‌చ్చి వెళ్లిపోయారు. ఆ త‌ర్వాత‌.. ఆయ‌న అసెంబ్లీ ముఖం కూడా చూడ‌లేదు.

ఇటీవ‌ల ప్రారంభ‌మైన అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల‌కు కూడా కేసీఆర్ డుమ్మా కొడుతూనే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో రెండు మూడు రోజుల కింద‌ట సీఎం రేవంత్‌రెడ్డి కూడా.. స‌భ‌లో కేసీఆర్‌కు ఇస్తున్న జీతం, భ‌త్యాల వివ‌రాల‌ను ఉటంకించారు. ప‌నిచేయ‌కుండానే జీతం తీసుకుంటున్న ఏకైక వ్య‌క్తి ఎవ‌రైనా ఉన్నారంటే అది కేసీఆరేన‌ని రేవంత్‌రెడ్డి దుయ్య‌బ‌ట్టారు. ఏకంగా ఆయ‌న 57 ల‌క్ష‌ల వ‌ర‌కు జీతం రూపంలో ఇచ్చామ‌ని.. ఇవికాకుండా.. భ‌త్యాలు, సెక్యూరిటీ ఖ‌ర్చు అద‌నంగా ఉంద‌న్నారు.

ఇదిలావుంటే.. తాజాగా కేసీఆర్ ఎమ్మెల్యే స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయాల‌ని కోరుతూ.. కాంగ్రెస్ నాయ‌కులు ఉద్య‌మించారు. స‌భ‌కురాకుండా వేతనం తీసుకుంటున్నార‌ని ఆరోపించారు. అంతేకాదు.. ఎన్నోఆశ‌ల‌తో గజ్వేల్ ప్ర‌జ‌లు కేసీఆర్‌ను గెలిపించార‌ని, కానీ, ఆయన వారిని ఏమాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని,.. స‌మ‌స్య‌లు చెప్పుకోవాల‌న్నా అందుబాటులో లేర‌ని.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై స‌భ‌లో ప్ర‌శ్నించ‌డం కూడా లేద‌ని పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ స‌భ్య‌త్వాన్ని త‌క్ష‌ణ‌మే ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

తాజాగా గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి హైద‌రాబాద్‌కు కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు సుమారు 50 మందికి పైగా పాద‌యాత్ర‌గా వ‌చ్చారు. తొలుత సీఎం రేవంత్‌రెడ్డిని క‌లుసుకుని విన‌తి ప‌త్రం ఇచ్చారు. అనంత‌రం.. గ‌వ‌ర్న‌ర్‌ను క‌లుసుకుని.. కేసీఆర్ స‌భ్య‌త్వం ర‌ద్దు చేయాల‌న్న విన‌తి ప‌త్రం ఇవ్వ‌నున్న‌ట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు న‌ర్సారెడ్డి ఈ ఉద్య‌మానికి నేతృత్వం వ‌హిస్తున్నారు. దీంతో ఈ వ్య‌వ‌హారం ఎలాంటి మ‌లుపు తిరుగుతుందో చూడాలి. మ‌రోవైపు బీజేపీ నాయ‌కులు కూడా.. కేసీఆర్ వ్య‌వ‌హారంపై కోర్టుకు వెళ్ల‌నున్న‌ట్టు తెలిసింది.