ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌కు తగిన విధంగా శాస్తి చేస్తామని బీజేపీ ఏపీ కీలక నాయకుడు, మాజీ చీఫ్ సోము వీర్రాజు అన్నారు. జగన్ మిడిసి పడుతున్నాడు. వచ్చే ఎన్నికల్లో అధికారం తనదేనని చెబుతున్నాడు. ఆయనకు ఎలాంటి శాస్తి చేయాలో అదే చేస్తాం అని వ్యాఖ్యానించారు. తాజాగా విజయ వాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంటునియోజకవర్గాల పునర్విభజనపై జగన్ దొంగాట ఆడుతున్నారని అన్నారు. ఒకవైపు డీలిమిటేషన్ కావాలని కోరుతూనే.. మరోవైపు ఇతర పక్షాలకు మద్దతు ప్రకటిస్తున్నాడని విమర్శించారు.
అంతేకాదు.. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వస్తామని జగన్ కలలు కంటున్నాడని.. ఆయన కలలను కల్లలు చేసేందుకు కూటమి రెడీగా ఉందని చెప్పారు. “గత ఎన్నికల్లో 40 శాతం ఓట్లు వచ్చాయని వైసీపీ చీఫ్ చెబుతున్నాడు. ఆ నలభైని 4 శాతానికి పడేస్తామని బీజేపీ నాయకుడు శపథం చేశారు. అధికారులను హెచ్చరించడం.. బెదిరించడం మానుకోవాలన్నారు.గ తంలో వైనాట్ 175 నినాదం ఏమైందో జగన్ వెనక్కి తిరిగి చూసుకోవాలని ఎద్దేవా చేశారు. ఏపీలో కూటమి పార్టీ ప్రభుత్వం బలంగా ఉందన్నారు.
కూటమి పార్టీలు వచ్చే ఎన్నికల వరకు కూడా బలంగానే ఉంటాయని.. వచ్చే ఎన్నికలు ఎప్పుడు జరిగినా .. తాము కలిసే పోటీ చేస్తామని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. కూటమి లక్ష్యం వైసీపీని ఖాళీ చేయడ మే. మళ్ళీ సిఎం అవుతానని జగన్ పగటి కలలు కంటున్నాడు. ఆ కలలను కల్లలు చేసేందుకు తామంతా కలిసే ఉంటాం అని సోము తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. జగన్‌ను ఎవరూ నమ్మరని మరో వ్యాఖ్య చేశారు. గతంలోనూ.. ఇప్పుడు జగన్‌కు ఒక విధానం అంటూ లేదని.. వైసీపీకి సిద్ధాంతాలు కూడా లేవన్నారు.
జగన్‌ను నమ్మిన వారు నట్టేట మునిగారని.. ఇప్పటికైనా తెలుసుకుని మిగిలిన వారు బయటకు వచ్చి.. జగన్‌కు బుద్ధి చెప్పాలని సోము వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష హోదా అనేది లాక్కుంటే వచ్చేది కాదన్న సోము.. ప్రజలే ఇవ్వనప్పుడు.. కూటమి ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. 2014లో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఉందని.. అయినా.. జగన్ ఎందుకు సభకు డుమ్మా కొట్టారని ఆయన నిలదీశారు. జగన్‌కు ఇక, ఫ్యూచర్ లేదని.. ఏదైనా జైలు గోడల మధ్యే ఉంటుందని భావిస్తున్నానని తీవ్ర విమర్శలు చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates