నేను పారిపోలేదు.. వెళ్లానంతే: ప్ర‌భాక‌ర్‌రావు

తెలంగాణ‌ను కొన్నాళ్ల పాటు కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్ర‌ధాన నిందితుడిగా ఉన్న అప్ప‌టి ఐపీఎస్ అధికారి ప్ర‌భాక‌ర్‌రావు.. తాజాగా త‌న‌కు బెయిల్ ఇవ్వాల‌ని కోరుతూ.. నాంప‌ల్లి కోర్టును ఆశ్ర‌యించారు. ప్ర‌స్తుతం ఆయ‌న అమెరికాలో ఉన్న‌ట్టుగా ఈ కేసును విచారిస్తున్న అధికారులు చెబుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ను త‌మ‌కు అప్ప‌గించాలంటూ.. కేంద్రం ద్వారా రెడ్ కార్న‌ర్ నోటీసులు జారీ చేశారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ఎప్పుడు ఇండియాకు వ‌చ్చినా వెంట‌నే అరెస్టు చేయ‌నున్నారు.

ఈ నేప‌థ్యంలో ప్ర‌భాక‌ర్ రావు.. తాజాగా త‌న న్యాయ‌వాది ద్వారా నాంప‌ల్లి కోర్టులో ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్‌ను దాఖ‌లు చేయించారు. దీనిలో ఆయ‌న ప‌లు విష‌యాలు వెల్ల‌డించారు. తాను 35 ఏళ్ల‌కు పైగానే పోలీసు వృత్తిలో ఉన్నాన‌ని.. ఎక్క‌డా ఎలాంటి మ‌ర‌క‌లు లేవ‌ని.. అత్యంత అంకిత భావంతో ప‌నిచేశాన‌ని వెల్ల‌డించారు. కానీ, త‌న‌ను రాజ‌కీయంగా కొంద‌రు టార్గెట్ చేసి.. ఇప్పుడీ కేసులో ఇరికించార‌ని ఆయ‌న పేర్కొన్నారు. తన‌కు ఫోన్ ట్యాపింగ్ కేసుతో ఎలాంటి సంబంధం లేద‌న్నారు.

ప్ర‌స్తుతం త‌న వ‌య‌సు 65 ఏళ్ల‌ని పేర్కొన్న ప్ర‌భాక‌ర్‌రావు.. అనారోగ్య‌ సమ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డుతున్నాన‌ని చెప్పారు. వైద్యం కోస‌మే తాను అమెరికాకు వ‌చ్చాన‌ని.. రాష్ట్రాన్ని, దేశాన్ని విడిచి ఎక్క‌డికీ పారిపోలేద‌ని.. పేర్కొన్నారు. త‌న‌పై అన‌వ‌స‌రంగా అభాండాలు వేస్తున్నార‌ని తెలిపారు. తాను నిబ‌ద్ధ‌త‌గ‌ల‌, దేశ భ‌క్తిగ‌త పోలీసు అధికారిన‌ని పిటిష‌న్‌లో పేర్కొన్నారు. ఈ విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని త‌న‌కు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేయాల‌ని కోర్టును అభ్య‌ర్థించారు. ఈ పిటిష‌న్ సోమవారం విచార‌ణ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని న్యాయ‌వాది తెలిపారు.