అగ్ర రాజ్యం అమెరికాలో డబ్బులిచ్చి పౌరసత్వం కొనుక్కొనే వెసులుబాటు అప్పుడే మొదలైపోయింది. 5 మిలియన్ డాలర్లు చెల్లిస్తే… గోల్డ్ కార్డ్ పేరిట అమెరికా పౌరసత్వం ఇట్టే దక్కిపోతుంది. ఎంచక్కా అమెరికాలో ఆ దేశ పౌరులుగా చెలామణి అయిపోవచ్చు. ఆ దేశ పౌరులు పొందుతున్న అన్ని రకాల సేవలనూ దర్జాగా పొందవచ్చు. ఈ కొత్త పౌరసత్వాన్ని కొనుగోలు చేసేందుకు జనం ఎగబడే అవకాశాలున్నాయన్న వాదనలు నిజమేనన్నట్లుగా… గోల్డ్ కార్డుల అమ్మకం మొదలైన తర్వాత ఒక్కరోజే ఏకంగా 1,000 మంది ఈ పౌరసత్వాన్ని కొనుగోలు చేశారు. ఫలితంగా అమెరికాకు తొలి రోజే ఏకంగా 5 బిలియన్ డాలర్లు సమకూరాయి.
ఈ మేరకు శనివారం ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడిన సందర్భంగా అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవర్డ్ లుట్నిక్ తెలిపారు. 5 మిలియన్ డాలర్లు చెల్లించి అమెరికా పౌరసత్వం కొనుగోలు చేసే సామర్థ్యం ఉన్న వారు విశ్వవ్యాప్తంగా 3.7 కోట్ల మంది ఉన్నారని చెప్పిన లుట్నిక్… వారిలో హీనపక్షం 10 లక్షల మంది తమ దేశ పౌరసత్వాన్నిపొందుతారని అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నారని తెలిపారు. అధ్యక్షుడి టార్గెట్ రీచ్ అయితేనే… తమ దేశ ఖజానాకు 5 ట్రిలియన్ డాలర్ల సంపద సమకూరుతుందని కూడా ఆయన తెలిపారు.
గతంలో ఓ సారి అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో ట్రంప్ ఈ మేర స్పీడుతో వెళ్లలేదనే చెప్పాలి. అయితే ఈ దఫా మాత్రం అమెరికా అధ్యక్ష పదవి చేపట్టినంతనే…సంచలనాలకే సంచలనంగా నిలుస్తున్న నిర్ణయాలను ట్రంప్ తీసుకున్నారు. విదేశీయులకు ఇస్తున్న వీసాలు, పార్ట్ టైం ఉద్యోగాలపై కీలక నిర్ణయం తీసుకున్న ట్రంప్… గ్రీన్ కార్డు హోల్డర్ల పిల్లల పౌరసత్వంపైనా అందరికీ షాకిచ్చే దిశగా అడుగులు వేశారు. కోర్టులు ఈ నిర్ణయాన్ని నిలువరించినా కూడా ట్రంప్ వెనక్కు తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో గోల్డ్ కార్డుల కోసం విదేశీ సంపన్నులు ఎగబడుతున్న తీరు ఆసక్తి రేకెత్తిస్తోంది.