టీడీపీ ఎంఎల్సీ రాజీనామా

తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత పోతుల సునీత తన ఎంఎల్సీ పదవికి రాజీనామా చేశారు. ఎంఎల్సీ పదవికి రాజీనామా చేసిన సునీత తన రాజీనామా లేఖను శాసనమండలి ఛైర్మన్ ఎంఏ షరీఫ్ కు పంపించారు. మామూలుగా ఎవరైనా ఎంఎల్ఏ, ఎంఎల్సీ, ఎంపిలుగా రాజీనామా చేసిన వాళ్ళు దాన్ని పార్టీ అధ్యక్షునికి పంపుతారు. ఎందుకంటే తాము రాజీనామా చేసినట్లుంటుంది…ఎలాగూ దాన్ని పార్టీ అధ్యక్షుడు స్పీకర్ కో లేకపోతే ఛైర్మన్ కు పంపరన్న గ్యారెంటీ ఉంది కాబట్టి.

కానీ ఇక్కడ సునీత అలా చేయకుండా రాజీనామా లేఖను నేరుగా షరీఫ్ కే పంపేశారు. 2017లో టీడీపీ తరపున ఎంఎల్సీగా ఎన్నికైన పోతుల ఈమధ్య చంద్రబాబునాయుడుతో విభేదించారు. దాదాపు ఎనిమిది నెలలుగా చంద్రబాబుకు సునీతకు బాగా గ్యాప్ వచ్చేసింది. అందుకనే టీడీపీ ఎంఎల్సీగానే ఉండి జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలబడ్డారు. దాంతో ఆమెపై అనర్హత వేటు వేయాలంటు పార్టీ తరపున మండలి ఛైర్మన్ కు లేఖ వెళ్ళింది.

ఇదే విషయమై మండలి ఛైర్మన్ కూడా పోతులకు నోటీసులు పంపించారు. ఇప్పటికి మూడుసార్లు విచారణకు రమ్మని నోటీసులు పంపినా పోతుల హాజరుకాలేదు. కరోనా వైరస్ కారణంగా తాను విచారణకు హాజరుకాలేకపోతున్నట్లు రెండుసార్లు ఛైర్మన్ కు సునీత లేఖ రాశారు. అలాగే మూడోసారి తనకు అనారోగ్యంగా ఉన్న కారణంగా విచారణకు రాలేనని చెప్పారు. అయితే ఎవరు ఊహించని విధంగా సునీత నుండి ఛైర్మన్ కు రాజీనామా లేఖ అందింది.

ఎంఎల్సీగా రాజీనామా చేసిన పోతుల ఎలాగూ టీడీపీకి కూడా దూరమైపోయారు కాబట్టి చంద్రబాబు, లోకేష్ పై ఆరోపణలు చేసేశారు. పార్టీని వదిలేసిన నేతలు తమ అధినేతలపై ఆరోపణలు చేయటం సాధారణమైపోయింది. అంబేద్కర్ స్పూర్తికి చంద్రబాబు తూట్లుపొడుస్తున్నాడంటూ సునీత ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల కోసం జగన్ పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు అభినందించారు.

రాష్ట్రప్రయోజనాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటిల సంక్షేమాన్ని చంద్రబాబు కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నట్లు మండిపడ్డారు. ఇటువంటి కారణాలతోనే చంద్రబాబు వైఖరికి నిరసనగానే తన ఎంఎల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు తన లెటర్లో స్పష్టం చేశారు. పోతుల రాజీనామా తర్వాత రెండో రాజీనామా ఎవరిదో చూడాలి. ఎందుకంటే పోతులతో పాటు అప్పట్లోనే శివనాధరెడ్డి కూడా టీడీపీకి దూరమైపోయారు. ఈయన మీద కూడా అనర్హత లేఖను టీడీపీ ఇచ్చింది.