అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ, నదీ తీర ప్రాంతంలో నగర నిర్మాణం సాధ్యం కాదన్న వ్యాఖ్యలు ప్రజల్లో, ముఖ్యంగా రాజధాని రైతుల్లో ఆగ్రహాన్ని కలిగించాయి. అమరావతి కేవలం భౌగోళిక అంశం కాదని, ప్రజల త్యాగాలు, ఆకాంక్షలతో ముడిపడిన అంశమనే భావనను జగన్ వ్యాఖ్యలు విస్మరించాయన్న విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ వ్యతిరేకత నేపథ్యంలో వైసీపీ నష్ట నివారణ చర్యలకు దిగింది. సజ్జల రామకృష్ణారెడ్డి, పేర్ని నాని వంటి నేతలు రంగంలోకి దిగి, జగన్ అమరావతిని ఎప్పుడూ వ్యతిరేకించలేదని వివరణలు ఇచ్చే ప్రయత్నం చేశారు.
జగన్ అమరావతిలో ఇల్లు, పార్టీ కార్యాలయం నిర్మించుకున్నారని, పాలనా వికేంద్రీకరణ పేరుతో రాజధానిని తక్కువ చేయలేదని వారు స్పష్టం చేశారు. అయితే ఈ వివరణలు ప్రజల అసంతృప్తిని పూర్తిగా చల్లార్చలేకపోతున్నాయి.
2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ అమరావతి విషయంలో తీసుకున్న నిర్ణయాలు రాజధాని రైతుల్లో ఆగ్రహాన్ని రేపాయి. రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వచ్చినప్పటికీ అప్పట్లో వైసీపీ తన వైఖరిని మార్చలేదు.
2024 ఎన్నికల తర్వాత అమరావతే రాజధాని అన్న మాటలు వైసీపీ నేతల నుంచి వినిపించాయి. అయితే తాజాగా జగన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదాస్పదమయ్యాయి. దీంతో వైసిపి.. జగన్ అలా చెప్పలేదంటూ ఎవరు నేర్చుకునే ప్రయత్నం చేస్తుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates