అఫీషియల్: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.
“త్వరలో జరగనున్న తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ అధినేత కార్యవర్గంతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు” అని శనివారం సాయంత్రం పార్టీ విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ కమిటీలు, కార్యాచరణను కూడా ప్రారంభించామని తెలిపింది.

రాష్ట్రంలోని 117 మునిసిపాలిటీలకు త్వరలోనే నోటిఫికేషన్ రానుంది. అయితే సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో సాధ్యమైనన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు జనసేన ప్రయత్నిస్తుందని అధికారిక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలో సరికొత్త రాజకీయాలకు జనసేన ప్రాధాన్యం ఇస్తుందని తెలిపింది. అలాగే యువతకు, రాజకీయాలపై బలమైన ఆకాంక్ష ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర రాజకీయాల్లో బలమైన పునాది వేయడమే లక్ష్యంగా స్థానిక ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యామని వివరించింది. ఈ ఎన్నికల్లో స్థానిక జనసైనికులు, వీర మహిళలకు ప్రాధాన్యం ఉంటుందని కూడా ప్రకటనలో స్పష్టం చేసింది.

ఇటీవలి పర్యటనలోనే…

ఇటీవల జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించారు. ఈ సందర్భంగా టీటీడీ సహకారంతో నిర్మించనున్న భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే సిద్ధమవ్వాలని ఆయన సూచించారు.

దీనిలో భాగంగా జిల్లాల వారీగా కమిటీలను పునరుద్ధరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఉన్న కమిటీలను రద్దు చేసి, కొత్త కార్యవర్గాన్ని గుర్తించాలని నిర్ణయించారు. ఇప్పుడు అధికారికంగా స్థానిక ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు జనసేన ప్రకటించింది. ఈ నెల 20లోగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.