పడిపడి నవ్వి… ‘పది సార్లు బల్ల గుద్దిన’ బాబు

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం అత్యద్భుతమైన వేడుకలతో ముగిశాయి. ‘ఆంధ్రప్రదేశ్ లెజిస్టేచర్ కల్చరల్ ఈవెనింగ్’ పేరిట నిర్వహించిన కార్యక్రమం మాత్రం అమితంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు అందులోని కామెడీ స్కిట్లను చూసి పడిపడి నవ్వారు. చంద్రబాబు అయితే తన లైఫ్ లోనే నవ్వలేనంతగా పడిపడి నవ్వారు. ఆ తర్వాత అదే విషయాన్ని కూడా ఆయన తెలిపారు. అంతేకాకుండా అలా నవ్వుతూ ఉంటే… రోగాలకు దూరంగా ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. ఫలితంగా ఆసుపత్రుల అవసరం తగ్గుతుందని, ఔషధాల అవసరం ఏమీ ఉండదని కూడా ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమం మొత్తంంలో చంద్రబాబు పడి పడి నవ్విన విషయమే హైలెట్ గా నిలిచింది. కార్యక్రమం ముగిసిన తర్వాత మాట్లాడిన ప్రతి ఒక్కరూ… బాబు పడి పడి నవ్విన విషయాన్ని పదే పదే గుర్తు చేశారు. ఇక చంద్రబాబు తన ప్రసంగంలో ఓ ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావించారు. తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో మర్రి చెన్నారెడ్డి సీఎంగా ఉండగా… చంద్రబాబు విపక్షంలో ఉన్నారట. నాడు విపక్ష పార్టీ నేతగా చంద్రబాబు అధికార పక్షం తీరును నిరసిస్తూ ఓ సారి బల్లను గుద్దారట. దీంతో సీఎంగా ఉన్న చెన్నారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇదేం పద్దతని ప్రశ్నించారట. అందుకు ప్రతిగా పది సార్లు పదే పదే బల్లను గుద్ది ఏం చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారట. చంద్రబాబు పోరాట స్ఫూర్తిని చూసి చెన్నారెడ్డి కూర్చుండిపోయారట. ఈ విషయాన్ని చెబుతూ చంద్రబాబు రాజకీయ నేతలకు ఉండాల్సిన స్ఫూర్తిని ప్రస్తావించారు.

కార్యక్రమంలో భాగంగా కామెడీ స్కిట్, నేటి ఎమ్మెల్యేల తీరును కళ్లకు కట్టిన స్కిట్, కూచిపూడి బాలికల నృత్యం, ఆయా పాత్రల్లో స్వయంగా ఎమ్మెల్యేలు తమదైన ప్రతిభను చాటిన తీరు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. దుర్యోధనుడి వేషధారణలో కనిపించిన వైనం అమితంగా ఆకట్టుకుంది. ఇక కూచిపూడి నృత్య ప్రదర్శన అమరావతి నేపథ్యంతో రూపొందిదన్న విషయాన్ని తెలుసుకున్న చంద్రబాబు.. అమరావతికి మోదీ వచ్చిన సందర్బంగా ఈ కార్యక్రమం ఉండేలా చూస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. దాదాపుగా మూడు గంటలకు పైగా సాగిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుందని చెప్పక తప్పదు. ఇక గడచిన మూడు రోజులుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నిర్వహించిన క్రీడల్లో ఉత్సాహంగా పాలుపంచుకున్న ప్రజా ప్రతినిధులకు చంద్రబాబు, పవన్ లు బహుమతులు అందజేశారు.