ఏపీలో శాసనసభ్యుడు, శాసన మండలి సభ్యులకు ప్రస్తుతం క్రీడా పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రీడల్లో హోదాలు, వయసును పక్కనపెట్టేసిన ప్రజా ప్రతినిధులు చిన్న పిల్లల మాదిరి కేరింతలు కొడుతున్నారు. ఉత్సాహంగా క్రీడల్లో పాలుపంచుకుంటున్నారు. తమలో దాగి ఉన్న ప్రతిభా పాటవాలను బయటకు తీస్తున్నారు. అయితే క్రీడలకు ఎంతైనా ఫిట్ నెస్ అవసరం కదా. అంతేకాకుండా ఒకింత గ్యాప్ వచ్చిందంటే… తిరిగి పుంజుకోవడానికి కాస్తంత సమయం కూడా పడుతుంది. ఈ క్రమంలో కాలు జారడం, కింద పడటం, దెబ్బలు తగలడం కూడా జరిగిపోతుంటాయి.
ఇప్పుడు విజయవాడలో జరుగుతున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్రీడా పోటీల్లోనూ గురువారం అదే జరిగింది. గురువారం తెల్లారగానే… చల్లటి వాతావరణంలో ప్రజా ప్రతినిధుల మద్య కబడ్డీ పోటీలు జరిగాయి. కబడ్డీలో టీడీపీ సీనియర్ నేత, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఉత్సాహం పాలుపంచుకున్నారు. కూతకు వచ్చిన ప్రత్యర్థి జట్టు సభ్యుడిని పట్టుకునే క్రమంలో ఆయన అదుపు తప్పి వెనక్కు పడిపోయారు. దీంతో వెనుకే ఉన్న కుర్చీల మీదుగా ఆయన తల పడిపోగా… తలకు గాయమైంది.
ఇక పులివెందుల టీడీపీ నేత, ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి కూడా ఈ క్రీడల్లో గాయపడ్డారు. అదే సమయంలో జనసేన నేత, అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కూడా ఈ క్రీడా పోటీల్లో గాయపడ్డారు. రాంభూపాల్ రెడ్డి ఒకింత బొద్దుగా ఉన్నా… అరవ శ్రీధర్ మాత్రం ఫిట్ గానే కనిపిస్తారు. అయినా వీరిద్దరూ గాయపడటం గమనార్హం. ఎంతైనా ఇటీవల రాజకీయాల్లో పడి వీరంతా క్రీడలను అలా పక్కనపెట్టేశారు కదా. అందుకే ఇలా గ్రౌండ్ లో దిగగానే అలా గాయపడ్డారు. బుచ్చయ్య, రెడ్డి, శ్రీధర్ లను అధికారులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates