జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యవహార సరళి ఇతరులకు భిన్నంగా ఉంటుంది. ఏదైనా చేయాలనుకున్నారంటే… పవన్ దానిపై ఏమంత పెద్దగా ఆలోచన చేయరు. అనుకున్న వెంటనే దానిని చేసేయడమే ఆయనకు తెలుసు. కౌలు రైతులకు ఆర్థిక సాయమైనా… అగ్ని ప్రమాదంలో సర్వ కోల్పోయిన జాలరులను ఆదుకోవడంలో అయినా… పవన్ ఇలా అనుకుని అలా రంగంలోకి దిగిపోయారు. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు కూడా పవన్ తీరులో ఈ తరహా వైఖరిలో ఏమాత్రం మార్పు రాలేదు. మన్యం జిల్లాలో ఓ మారుమూల పల్లెలో ఓ పాఠశాలను ఆయన పునర్మిస్తున్నారు. ఇందుకోసం ఆయన పూర్తిగా తన సొంత నిధులనే వెచ్చిస్తున్నారు.
అల్లూరి సీతారామారాజు మన్యం జిల్లా పరిధిలోని అనంతగిరి మండలం బల్లగరవ గ్రామ పంచాయతీ పరిధిలో ఓ రోడ్డు నిర్మాణాన్ని పరిశీలించేందుకు ఇటీవల వెళ్లిన పవన్… ఆ పనులను పరిశీలించిన తర్వాత తిరుగు ప్రయాణంలో బల్లగరవ గ్రామానికి ఓ కిలో మీటర్ దూరంలో ఉన్న చిన్న మజరా గ్రామంలో ఓ 43 మంది పిల్లలు చదువుతున్న పాఠశాలను చూశారు. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న పాఠశాల భవనంలోనే పిల్లలు చదువుతున్నారు. తాగు నీటి వసతి లేదు. మరుగుదొడ్లు ఆనవాళ్లే కనిపించలేదు. సైలెంట్ గా మొత్తాన్ని పరిశీలించి.. ఓ పెన్నూపేపరు తీసుకుని అంతా నోట్ చేసుకున్నారు. ఎవరితో ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఆ తర్వాత అసలు పని ప్రారంభమైపోయింది.
కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న సదరు పాఠశాల భవనం కూలిపోయింది. దాని స్థానంలో దాని కంటే ఒకింత పెద్దగా, విశాలంగా పాఠశాల భవన నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. దాని పక్కనే బోరు వేశారు. ఆ బోరులో నిండా నీరు పడింది. పాఠశాల భవనం, దాని పరిసరాల చుట్టూ ఎంచక్కా ప్రహరీ గోడ కూడా కడుతున్నారు. ఆ ప్రాంగణంలోనే పిల్లలకు మరుగుదొడ్లు కూడా నిర్మాణం అవుతున్నాయి. ఈ పనులన్నీ కూడా సర్కారీ నిధులతో చేపట్టే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ ఓ ఆర్డర్ వేస్తే ఇట్టే పనులు జరిగిపోతాయి. అయితే ఆ తంతు అంతటినీ పక్కనపెట్టేసిన పవన్… ఆ పాఠశాల నిర్మాణానికి పూర్తిగా తన నిధులను వెచ్చిస్తున్నారు. మరి దాని పరిశీలన సందర్బంగా పనవ్ మనసులో ఎలాంటి భావన కలిగిందో తెలియదు గానీ… దానిని దత్తత తీసుకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకుంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates