తెలంగాణ రాజకీయాలను పెను కుదుపులకు గురిచేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కీలక దశకు చేరుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ప్రతిపక్షాల ఫోన్లను ట్యాప్ చేసి.. వారిని కట్టడి చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించిందన్న ఆరోపణలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక.. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పలువురు అధికారులను అరెస్టు చేసింది. అప్పట్లో ఆఫీసునే ట్యాపింగ్ కేంద్రంగా మార్చుకున్న తీరు.. అనుసరించిన విధానాలు తీవ్ర సంచలనం సృష్టించాయి.
ఈ క్రమంలో పలువురిని అరెస్టు చేయగా.. సీనియర్ ఐపీఎస్ అధికారి.. ప్రభాకర్ రావు, అదేవిధంగా శ్రవణ్ రావులు భారత్ నుంచి తప్పించుకుని అమెరికాకు వెళ్లిపోయారు. వీరే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారని దర్యాప్తు అధికారులు నిర్దారించారు. ఈ క్రమంలో ప్రభాకర్, శ్రవణ్‌లను తిరిగి రప్పిం చేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం వీరిద్దరిపైనా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది.
ఇంటర్ పోల్(అంతర్జాతీయ వ్యవహారాలు చూసే సంస్థ) ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ విషయాన్ని సీబీఐ అధికారులు ట్యాపింగ్ కేసును విచారిస్తున్న తెలంగాణ సీఐడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వీలైనంత తొందరగా ప్రభాకర్, శ్రవణ్‌లను భారత్‌కు రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో కీలక ఘట్టంగా దీనిని అధికారులు పేర్కొంటున్నారు. ఇంటర్ పోల్ ఇచ్చిన రెడ్ కార్నర్ నోటీసులు.. డీహెచ్ఎస్‌కు అందగానే అమెరికాలో పొవిజనల్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
కీలక దుమారం!
ఫోన్ ట్యాపింగ్ కేసు అనేక కీలక మలుపులు తిరిగింది. తొలుత దీనిని ఎవరూ గుర్తించలేదు. అయితే.. డీసీపీ కార్యాలయంలో హార్డ్ డిస్కులను సీఐ స్థాయి అధికారి తరలించుకోయిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు కావడం, అనుమానంతో అధికారులు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడంతో విచారణ ప్రారంభించా రు. తొలుత చిన్నదే అనుకున్న వ్యవహారం.. అనేక మంది నాయకుల చుట్టూ తిరిగింది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి కూడా దారి తీసింది. ఒకానొక దశలో మాజీ మంత్రి కేటీఆర్.. ట్యాపింగ్ తప్పుకాదని పేర్కొనడం కూడా దుమారం రేపింది.