వైసీపీ అధినేత జగన్‌కు తాజాగా భారీ షాక్ తగిలింది. గుంటూరు జిల్లా చిలకలూరి పేటకు చెందిన మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ పార్టీకి, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీ గా ఉన్నారు. అయితే.. గత కొన్నాళ్లుగా మర్రి పార్టీ మారుతున్నారన్న చర్చ ఉన్నప్పటికీ.. ఆయన స్పం దించలేదు. తాజాగా ఉరుములు లేని పిడుగులా.. మర్రి తన రాజీనామాకు పార్టీ కార్యాలయానికి పంపించా రు. బలమైన కమ్మ సామాజిక వర్గానికి చెందిన మర్రి.. రాజీనామాతో జగన్‌కు ఆ వర్గం మరింత దూరం కానుంది.
మోసం చేశారనేనా?
2019 ఎన్నికల సమయంలో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి మర్రి పోటీకి రెడీ అయ్యారు. సర్వం సిద్ధం చేసుకుని ప్రచారం కూడా ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో ఎన్నారై నాయకురాలు.. విడదల రజనీ అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చారు. దీంతో జగన్.. మర్రికి సీటును క్యాన్సిల్ చేసి.. విడదలకు ఇచ్చారు. అయితే.. ఈ పరిణామంతో కమ్మ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తుందని భావించిన జగన్.. ఆవెంటనే.. ఆయనకు పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మంత్రి పదవి ఇస్తామని మర్రికి హామీ ఇచ్చారు.
కానీ, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. మర్రి రాజశేఖర్‌ను జగన్ ఏమాత్రం పట్టించుకోలేదు. అయినా మర్రి చాలా విధేయతగానే ఉన్నారు. మూడు సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత.. ఒక సందర్భంలో చాలా తక్కువ స్థాయిలోనే ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక, గత ఏడాది ఎన్నికలకు ఆరేడు మాసాల ముందు.. మర్రికి ఎమ్మెల్సీ ఇచ్చారు. కానీ, తన జీవితంలో టికెట్ కోల్పోయి కూడా మంత్రి కాలేకపోయానన్న ఆవేదన మర్రిలో ఉండిపోయింది. ఇదే.. తాజాగా ఆయన వైసీపీని వీడడానికి కారణమని తెలుస్తోంది.
ఇప్పటికే నలుగురు!
ఇదిలావుంటే.. వైసీపీకి అసెంబ్లీలో కేవలం 11 మంది మాత్రమే బలం ఉంటే.. శాసన మండలిలో మత్రం ప్రధాన ప్రతిపక్షం పొందేంత బలం ఉంది. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా మండలిలో చలామణి అవుతోంది. అయితే.. తాజాగా ఈ బలం కూడా సన్నగిల్లుతుండడం గమనార్హం. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. వీరిలో బల్లి కల్యాణ్ చక్రవర్తి(ఎస్సీ), పోతుల సునీత(బీసీ), జయమంగళ వెంకటరమణ(బీసీ), కర్రి పద్మశ్రీ ఉన్నారు. ఇప్పుడు మర్రి రాజీనామాతో ఈ సంఖ్య ఐదుకు చేరింది.