నొప్పింపక.. తానొవ్వక.. అన్నట్టుగా.. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్‌ను తీర్చి దిద్దింది. డాంబికాలకు పోకుండా.. అలాగని ఎవరినీ విస్మరించకుండా.. అన్ని వర్గాలను అంతో ఇంతో సంతృప్తి పరిచేలాగానే.. వార్షిక బడ్జెట్ను రూపొందించడం గమనార్హం. అయితే.. కీలకమైన వ్యవసాయ, విద్య, ఉపాధికల్పన రంగాలకు మాత్రం.. ఈ బడ్జెట్ విదిలింపేనని చెప్పాల్సి ఉంటుంది. బలమైన సాగు రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని.. రెండు రోజుల కిందట సీఎం రేవంత్ రెడ్డి సభాముఖంగా చెప్పుకొచ్చారు.
కానీ, ఆయన మాటల్లో ఉన్నంత బలం.. సాగుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించే విషయంలో లేదనే చెప్పాలి. ప్రస్తుత అంచనాల ప్రకారం.. లక్ష కోట్ల రూపాయల వరకు సాగు కు కేటాయించాలని.. వ్యవసా య శాఖ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. కానీ, దీనిలో పావు వంతు మాత్రమే(24,439 కోట్లు) కేటాయించడం ద్వారా.. సాగుకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా.. సానుకూల రోజులు తేలేకపోతోందన్న విమర్శలు వస్తున్నాయి. మరో కీలకమైన శాఖ పశుసంవర్ధకం.
దీనికి మరీ నాసిరకమైన కేటాయింపులు ఉండడం గమనార్హం. పశుసంవర్థక శాఖకు – రూ.1,674 కోట్లు కేటాయించిన ఆర్థిక మంత్రి భట్టి.. రాష్ట్రంలో పశువుల కాపరులకు మేలు చేస్తామని హామీ ఇవ్వడం విశేషం. పౌర సరఫరాల శాఖకు రూ.5,734 కోట్లు కేటాయించారు. కానీ, దీనివల్ల పెద్దగా మేలు జరిగే అవకాశం లేదు. అయితే.. కేంద్రం ఎలానూ ఉచిత బియ్యం ఇస్తున్న దరిమిలా.. రాష్ట్రం తన వాటాను తగ్గించుకునే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది.
ఇక, సామాజిక వర్గాలకు ఈ బడ్జెట్‌లో పెద్దపీట వేశారనే చెప్పాలి. ఎస్సీ సంక్షేమానికి ఏకంగా మరో మాటలో చెప్పాలంటూ.. ఎవరూ ఊహించని విధంగా రూ.40,232 కోట్లు కేటాయించారు. అలానే ఎస్టీ సంక్షేమానికి రూ.17,169 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.11,405 కోట్లు ఇచ్చారు. మరో కీలకమైన సామాజిక వర్గం మైనర్టీల సంక్షేమంకోసం రూ.3,591 కోట్లు కేటాయించారు. అయితే.. ఇవి కొంత మెరుగ్గానే ఉన్నా.. మిగిలి వాటి విషయంలో మాత్రం నొప్పింపక తానొవ్వక అన్నట్టుగానే ఉందని చెప్పకతప్పదు.