‘డ్రైవర్’ సీట్లో మంత్రి నారా లోకేశ్!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం బస్సు డ్రైవర్ గా అవతారం ఎత్తారు. భారత పారిశ్రామిక దిగ్గజం హిందూజా గ్రూప్ నకు చెందిన అశోక్ లేల్యాండ్ బస్సు ఎక్కిన ఆయన వెళ్లి డ్రైవర్ సీట్లో కూర్చున్నారు. అంతేనా ఏకంగా స్టీరింగ్ కూడా పట్టేశారు. గేర్ రాడ్ పైనా చేయేశారు. ఇగ్నిషన్ ఒక్కటే తిప్పలేదు. అది కూడా జరిగి ఉంటే.. నిజంగానే మనం లోకేశ్ ను డ్రైవర్ గానూ చూసేవాళ్లం. అయితే ఆ పనిని లోకేశ్ చేయలేదు. బస్సు డ్రైవర్ సీట్లో కూర్చుని ఆయన ఫొటోలకు ఫోజులిచ్చి బస్సు నుంచి దిగిపోయారు. ఈ సందర్భంగా బస్సు ప్రత్యేకతలను ఆయన అశోక్ లేల్యాండ్ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.

ఈ ఘటన బుధవారం విజయవాడ పరిధిలోని మల్లవల్ల పారిశ్రామికవాడలో చోటుచేసుకుంది. అశోక్ లేల్యాండ్ సంస్థ మల్లవల్లిలో బారీ బస్ బాడీ బిల్డింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాన్ని బుదవారం ప్రారంభించిన లోకేశ్.. అనంతరం సరదాగా అలా బస్సులోకి ఎక్కి డ్రైవర్ సీట్లో కూర్చున్నారు. మల్లవల్లి అశోక్ లేల్యాండ్ కేంద్రలోనే సదరు బస్సుకు బాడీని కట్టారు. ఆ బస్సునే లోకేశ్ పరిశీలించారు. బస్సు బాడీని పరిశీలించిన లోకేశ్.. అందులో కొత్తగా ఏమేం సౌకర్యాలను ఏర్పాటు చేశారన్న దాని గురించి కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం అదే బస్సులో ముందు సీట్లో కూర్చుని ఆయన కొంతదూరం ప్రయాణించారు. బస్సులో సుఖమయ ప్రయాణానికి మంచి ఏర్పాట్లు జరిగాయని ఆయన కంపెనీ ప్రతినిధులను అభినందించారు. సీటింగ్ గానీ, లెగ్ స్పేస్, వాతావరణం అంతా బాగుంందని కూడా లోకేశ్ తెలిపారు. మొన్నటి ఎన్నికలకు ముందు యువగళం పేరిట పాదయాత్ర చేసిన సందర్భంగా మల్లవల్లిని సందర్శించిన లోకేశ్… తాము అధికారంలోకి రాగానే… మల్లవల్లికి నూతన జవజీవాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగానే కూటమి అధికారంలోకి రాగానే మల్లవల్లిలో పరిశ్రమలు కార్యకలాపాలు మొదలుపెట్టేలా ఆయన చర్యలు చేపట్టారు. ఇదే విషయాన్ని ఆయన కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా పేర్కొన్నారు.