వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, ఏపీ శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వ్యవహారం చూస్తుంటే… వైసీపీలో ఆయన చాలా కష్టంగానే కొనసాగుతున్నట్లుగా కనిపిస్తోంది.151 ఎమ్మెల్యే సీట్లున్న సమయంలో జగన్ కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగిన బొత్స…పార్టీ 11 సీట్లకు పడిపోవడం, మొన్నటి ఎన్నికల్లో తానే ఓడిపోవడం.. ఆపై ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఆయనకు జగన్ అవకాశం ఇవ్వడం… ఆ తర్వాత మండలిలో తనకంటే సీనియర్ మరొకరు లేకపోవడంతో… ప్రధాన ప్రతిపక్ష నేత హోదా చేపట్టడం…ఇలా వెంటవెంటనే జరిగిపోయాయి. అయితే ఎందుకనో గానీ.. బొత్స జనసేన వైపు ఆసక్తిగా చూస్తున్నట్లుగా విశ్లేషణలు మొదలయ్యాయి.
ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా.. వైసీపీ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టగా… మండలిలో బొత్స నేతృత్వంలో వైసీపీ పోరాటం సాగిస్తోంది. రాజకీయాల్లో తనకున్న సీనియారిటీ, ఆయా అంశాలపై పట్టు ఉన్న నేపథ్యంలో అధికార పక్షాన్ని బొత్స ఓ రేంజిలో అడ్డుకుంటున్నారు. సభలో విపక్ష నేత పాత్రకు న్యాయం చేస్తున్న బొత్స… సభ బయటకు రాగానే అధికార పక్ష నేతలతో కలిసిమెలసి సాగుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను పలకరించిన బొత్స… పవన్ ఆరోగ్యంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా బొత్సతో పవన్ హుషారుగా మాట్లాడుతూ కనిపించారు.
ఓ మూడు నెలల క్రితం వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, తన సమకాలీకుడు అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి అసెంబ్లీ ప్రాంగణంలోకి వెళ్లిన సందర్భంగానూ బొత్స… పవన్ ను పలకరించేందుకు పెద్దిరెడ్డినే వదిలేసి వెళ్లిపోయారు. పవన్ ఓ వైపు తన పార్టీ సభ్యులతో కలిసి ఏదో మాట్లాడుతూ నిలబడి ఉండగా… వారికి కాస్తంత దూరంగా వైసీపీ సభ్యుల బృందం వెళుతోంది. పవన్ ను చూసినంతనే.. తన పార్టీ నేతలను వదిలేసి పవన్ శిబిరం వద్దకు వెళ్లిన బొత్స…పవన్ తో కరచాలనం చేశారు. ఇరువురు యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ దృశ్యం తన కళ్లబడినా…చూసీచూడనట్టుగా పెద్దిరెడ్డి వెళ్లిపోయిన వైనం నాడు విస్పష్టంగానే కనిపించింది. అయినా కూడా బొత్స పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి.
ఇదంతా చూస్తుంటే… ఏమాత్రం అవకాశం చిక్కినా… బొత్స ప్లేటు ఫిరాయించేందుకు సిద్ధంగానే ఉన్నట్లు జోరుగా పుకార్లు వినిపిస్తున్నాయి. జగన్ ఏకపక్ష వైఖరి, ఇటీవలే ఉత్తరాంధ్రలో సీనియర్ మోస్ట్ నేతగా తానున్నా… తనను కాదని ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ గా మాజీ మంత్రి కురసాల కన్నబాబును నియమించిన తీరుపై బొత్స అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ కారణంగానే కురసాల కన్నబాబు పదవీ బాధ్యతల స్వీకారానికి బొత్స గైర్హాజరయ్యారన్న వాదనలు వినిపిస్తున్నాయి. జనసేన కొత్త పార్టీ కావడం, పార్టీ పట్ల జనంలో మంచి మైలేజీ కనిపిస్తుండటం, ఆశించినంత మంది నేతలు లేకపోవడం, ఓ మోస్తరు సీనియారిటీ ఉండే నేతలు వెళితే ఇట్టే మెరుగైన అవకాశాలు దక్కడం ఖాయమన్న వాదనలు లేకపోలేదు.ఈ అంచనాలతోనే బొత్స కూడా ఉన్నారని, ఏమాత్రం అవకాశం చిక్కినా ఆయన జంప్ కొట్టడం ఖాయమని తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates