పైన ఫొటోలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో కలిసి కనిపిస్తున్న బుడ్డోడి పేరు నంద్యాల సిద్ధార్థ్. వయసు 14 ఏళ్లే. ఊరు అనంతపురం జిల్లా అయినా… అతడి ఫ్యామిలీ అమెరికాలోని డల్లాస్ లో స్థిరపడింది. ఈ బుడ్డోడూ అక్కడే పెరిగాడు. అక్కడే చదువుతున్నాడు. 14 ఏళ్లకే అతడు ఒకాకిల్, ఏఆర్ఎంల నుంచి ఏఐ నిష్ణాతుడిగా సర్టిఫికెట్లను పొందాడు. ప్రపంచంలోనే ఏఐపై పట్టు సాధించిన అతి పిన్న వయస్కుడు కూడా ఇతడే. అంతేనా.. సిర్కాడియన్ ఏఐ పేరిట ఓ యాప్ నే అతడు అభివృద్ది చేశాడు. దానితో అతడు ఏడంటే ఏడు సెకన్లలో మానవుల గుండె జబ్బులను కనిపెట్టేస్తున్నాడు. ఈ కనిపెట్టడంలోనూ 96 శాతం ఖచ్చితత్వంతో అతడు సత్తా చాటుతున్నాడు.
ఇటీవలే సొంతూరు పర్యటనకు వచ్చిన సిద్ధార్థ్ తండ్రితో కలిసి గుంటూరు జీజీహెచ్ ను కూడా సందర్శించాడట. అక్కడ ఏకంగా 700 మంది హృద్రోగ బాధితులను పరీక్షించి… వారిలోని రోగాలను ఇట్టే నిర్ధారించాడట. అమెరికాలోనూ అతడు ఏకంగా 800 మందికి పైగా హృద్రోగ వ్యాది నిర్ధారణ పరీక్షలు చేశాడు. మొత్తంగా 1,500 మందికి ఈ పరీక్షలు చేసిన సిద్ధార్థ్… 96 శాతం ఆక్యూరసీతో రిపోర్టులను ఇచ్చాడు. తన మొబైల్ లోని సిర్కాడియన్ ఏఐ యాప్ ద్వారా సిద్ధార్థ్ ఈ పరీక్షలు చేస్తున్నాడు. ఈ యాప్ లో హృదయ స్పందనల ఆధారంగా అతడు రోగాన్ని నిర్ధారిస్తున్నాడు. గుండె జబ్బులు పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో సిద్ధార్థ్ రూపొందించిన సిర్కాడియన్ ఏఐ యాప్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పక తప్పదు.
ఈ బాలుడి గురించి వైద్యుల ద్వారా తెలుసుకున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్… సిద్ధార్థ్ ను సోమవారం సీఎం చంద్రబాబు వద్దకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సిద్ధార్థ్ తో అతడి నూతన ఆవిష్కరణలను విన్న చంద్రబాబు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంత చిన్న వయసులో ఏకంగా ఓ యాప్ నే తయారు చేయడమే కాకుండా…దానితో కేవలం సెకన్ల వ్యవధిలోనే గుండె జబ్బులను నిర్ధారిస్తున్న అతడి మేథస్సును చంద్రబాబు ఆకాశానికెత్తేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా బాలుడిని అభినందించారు. ఆరోగ్య రంగంలో ఓ మేలిమలుపు ఆవిష్కరణగా నిలుస్తున్న సిద్ధార్థ్ యాప్ ను ప్రోత్సహించే దిశగా అవసరమైన చర్యలు చేపడతామని చంద్రబాబు ప్రకటించారు.