రాజకీయాల్లో కొందరు నేతల తీరు విభిన్నంగా ఉంటుంది. ప్రజల సమస్యల పరిష్కారం కోసం వారు ఎంతదాకా అయినా వెళతారు. ఈ తరహా నేతలు ఇటీవలి కాలంలో చాలా తక్కువగానే ఉన్నా… ఆ తక్కువ సంఖ్యలో ఉన్న నేతల తీరు అందరినీ ఆకట్టుకుంటోందని చెప్పక తప్పదు. అప్పుడెప్పుడో తన నియోజకవర్గ ప్రజలు మురుగు నీటిలో నడవకుండా ఏర్పాట్లు చేయరా అంటూ…ఏపీలోని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నడుముల లోతు మురుగు నీటిలో దిగి నిరసన తెలిపారు. ఇప్పుడు తన నియోజకవర్గ ప్రజలకు చెత్త చెదారం నుంచి ఉపశమనం కోసం తెలంగాణలోని మల్కాజిగిరీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఏకంగా డంపింగ్ యార్డులో చెత్తపైనే కూర్చుని నిరసనకు దిగారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కోటంరెడ్డి… 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలవగా.. 2024లో టీడీపీ తరఫున విజయం సాధించారు. 2018లో విపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి… తన నియోజకవర్గంలో ఓ మురుగు నీటి కాలువపై బ్రిడ్జీ కోసం ఏకంగా ఆ మురుగు నీటిలోనే నిలబడి నిరసన తెలిపారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాగా… అధికార పార్టీ సభ్యుడిగానూ ఆయన ఇదే తీరున నిరసనకు దిగారు. ఇలా రెండు పర్యాయాలు మురుగు నీటిలో దిగితే గానీ… ఆయన ప్రస్తావించిన సమస్య పరిష్కారం కాలేదు.
తాజాగా మల్కాజిగిరీ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన మర్రి రాజశేఖర రెడ్డి… తన నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం ఓ రేంజిలోనే పనిచేస్తున్నారు. తన నియోజకవర్గ పరిధిలోని అల్వాల్ మచ్చ బొల్లారం శ్మశాన వాటికలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడంపై అక్కడి ప్రజలు చాలా రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం అక్కడికి వెళ్లిన మర్రి… స్థానికులతో కలిసి చెత్త కుప్పలపైనే కూర్చుని నిరసనకు దిగారు. తక్షణమే డంపింగ్ యార్డును అక్కడి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అల్లుడైన మర్రి… ఉన్నత విద్యావంతుడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates