వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యలో అభియోగాలు ఎదుర్కొంటూ..అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరి భార్య షాబానాపై దాడి జరిగింది. అయితే.. ఈ విషయం ఆలస్యంగా ఆమె వెల్లడించారు. దాడి చేసిన వారు వైసీపీ మహిళా కార్యకర్తలని, వారు కూడా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారేనని తెలిపారు. తనను బెదిరించి.. దాడి చేయడంతో పాటు.. జగన్, ఎంపీ అవినాష్ రెడ్డిల జోలికి వస్తే.. దస్తగిరిని కూడా లేపేస్తామని హెచ్చరించినట్టు ఆమె చెప్పారు. మరో కీలక విషయం ఏంటంటే.. ఈ దాడి జరిగిన తర్వాత పోలీసులను ఆశ్రయించినా.. తనకు రక్షణ కల్పించకపోగా.. కేసు కూడా నమోదు చేయలేదని షాబానా ఆరోపించారు.
షాబానా మాటల్లో..
“కడప జిల్లా పులివెందులలోని మల్యాలలో మా బంధువుల ఇంటికి వెళ్లాలని అనుకున్నాం. మా ఆయన పిల్లలు ముందుగానే వెళ్లిపోయారు. నేను ఆలస్యంగా బయలుదేరా. ఈ సమయంలో అనూహ్యంగా ఇద్దరు మహిళలు మా ఇంట్లోకి చొరబడ్డారు. నా పై దాడి చేశారు. రెండు చెంపలపై కొట్టారు. డొక్కల్లో తన్నారు. దాడి చేసిన వారు మాల్యాలకు చెందిన శంషూన్, పర్వీన్‌గా గుర్తించారు. వారు దాడి చేయడంతో బిగ్గరగా అరిచా. నా అరుపులు విని కొందరు మా ఆయనకు(దస్తగిరి) ఫోన్ చేశారు. ఆయన కొద్ది సేపటికి అక్కడకు చేరుకున్నారు. కానీ, మహిళలు ఆయనపైనా దాడికి ప్రయత్నించి.. వెళ్లిపోయారు” అని వివరించారు.
తనను దారుణంగా దూషించారని షాబానా తెలిపారు. అంతేకాదు.. ఈ కేసులో జగన్, ఎంపీ అవినాష్ రెడ్డి పేర్లు ఎందుకు చెబుతున్నారంటూ ప్రశ్నించారని చెప్పారు. వారి పేర్లు బయటకు వస్తే.. దస్తగిరిని కూడా నరికేస్తామని హెచ్చరించినట్టు షాబానా పేర్కొన్నారు. ఈ ఘటనపై తాను స్వయంగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా.. పోలీసులు పట్టించుకోలేదని.. కేసు నమోదు చేసి.. తనకు రక్షణ కల్పించాలని కోరినా మౌనంగా ఉన్నారని షాబానా తెలిపారు. వివేకా వాచ్‌మన్ రంగయ్య అనుమానాస్పద రీతిలో మరణించిన తర్వాత.. దస్తగిరిని కూడా చంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
పోలీసుల వాదన ఇదీ..
కాగా.. ఈ ఘటనపై మాల్యాల పోలీసులు స్పందించారు. తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని.. వస్తే పరిశీలించి కేసు నమోదు చేస్తామని చెప్పారు. షాబానాకు ఎలాంటి భయం అవసరం లేదన్నారు. ఇది కేవలం వ్యక్తిగత కారణంతోనే జరిగిన దాడిగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. అయినా.. ఫిర్యాదు అందితే పరిశీలిస్తామన్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాల్సి ఉంది.