బీజేపీకి ఉత్తరాదిలో ఉన్న బలం.. దక్షిణాదికి వచ్చే సరికి లేకుండా పోయింది. నిజానికి బండి సంజయ్, కిషన్‌రెడ్డి, పురందేశ్వరి వంటివారు ఉన్నా.. వారు బలమైన గళం వినిపించలేక పోతున్నారు. బండి సంజయ్ ఫైర్ బ్రాండ్ మాదిరిగా వ్యవహరిస్తున్నప్పటికీ.. ఆయన ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం అయ్యారు. కానీ, దక్షిణాదిలో చూస్తే.. బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. వాటిని ఎదుర్కొని.. బీజేపీ ముందుకు సాగడం అత్యంత కీలకం.
ఈ క్రమంలోనే జనసేన నాయకుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఇప్పుడు బీజేపీకి అందివచ్చిన ఆయుధంగా మారుతున్నారన్న చర్చ సాగుతోంది. జనసేన ఆవిర్భావ సభలో కేవలం ఆ పార్టీ గురించే ప్రస్తావించి.. పార్టీ విధి విధానాలను వెల్లడించాల్సిన పవన్ కల్యాణ్.. బీజేపీ అజెండాను భుజాన వేసుకు న్నారన్న చర్చ సాగుతోంది. దీనిని బట్టి.. ఆయన బీజేపీకి తురుపుముక్కగా మారుతున్నారా? అనేది కూడా ఆసక్తిగా మారింది.
నిజానికి జనసేన అధినేత బలమైన గళం వినిపిస్తారని.. బీజేపీ నాయకులు కూడా భావించలేదు. అయితే.. సనాతన ధర్మం పేరుతో విజృంభించిన తర్వాత.. పవన్‌పై ఆశలు బీజేపీకి భారీగా పెరిగాయి. దీంతో ఆయనను ఎంకరేజ్ చేయడం ప్రారంభించారని పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి. రాజకీయాల్లో ఇప్పటి శత్రువులు రేపు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. సో.. ఈ విషయంలో వైసీపీని కట్టడి చేసేందుకు కూడా.. పవన్‌కు బీజేపీ చెలిమి అవసరం.
ఇలా.. ఉభయ కుశలోపరి అన్నట్టుగా పవన్ వ్యవహారం ఉందన్న చర్చ ఉంది. దక్షిణాదిలో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో బీజేపీ ఉనికి లేదు. కర్ణాటకలో బాగానే ఉన్నా.. ప్రస్తుతం సుప్తచేతనావస్థలో ఉంది. తెలంగాణ, ఏపీల్లో ఫర్వాలేదన్న పరిస్తితిలో ఉంది. ఈ పరిణామాలను అంచనా వేసుకునే బీజేపీ.. దక్షిణాదిలో బలమైన గళం వినిపించే పవన్‌ను తనకు ఎడాప్ట్ చేసుకుంటోందన్న వాదన వినిపిస్తోంది. అయితే.. ఇది ఏమేరకు ప్రభావం చూపిస్తుందన్నది చూడాలి.