ఈ ఆంధ్రా రాగమేంది కవితక్క.. యాద్రాదికి సారు చేసిందేంటి?

kavitha

కొన్ని పాటలు కొన్ని సందర్భాలకే సూట్ అవుతాయి. ఈ విషయాన్ని ఎమ్మెల్సీ కవిత మర్చిపోతున్నారా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వేళ అధికారాన్ని సొంతం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పదేళ్లు పాలన చేసిన నాటి సంగతుల్ని ఆమె మర్చిపోతున్నారా? లేదంటే.. మర్చిపోయినట్లుగా వ్యవహరిస్తున్నారా? అన్నదిప్పుడు ప్రశ్న. అధికారం చేజారితే భావోద్వేగ రాజకీయాలు మంచివే కానీ.. ప్రాంతాల పంచాయితీలు ఇప్పుడు అవసరమా? అన్నది ప్రశ్న.

తాజాగా ఆమె మాట్లాడుతూ ఒక కీలక వ్యాఖ్య చేశారు. ‘జయజయహే తెలంగాణ’ గీతానికి ఆంధ్రా వ్యక్తితో సంగీతం చేయిస్తారా? ఇది సరికాదు, తెలంగాణలో సంగీత దర్శకులు లేరా?’ అంటూ ప్రశ్నించిన వైనం తెలంగాణ ఉద్యమం వేళలో అయితే బాగుండేది. కానీ.. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే.. పదేళ్ల కేసీఆర్ పాలన ఒక చరిత్రలో కనిపిస్తూ ఉంటుంది. తిరుపతిని తలదన్నేలా యాదాద్రిని డెవలప్ చేస్తామని చెప్పిన కేసీఆర్.. తన హయాంలో యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణంలో రూపకర్తగా ఆంధ్రాకు చెందిన ఆనంద్ సాయిని ఎందుకు ఎంపిక చేసినట్లు? అన్న ప్రశకు కవిత ఏమని సమాధానం చెబుతారు?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో లేరని.. అందుకే ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఆయన నిర్ణయాలు ఉండటం లేదన్న కవిత.. ముఖ్యమంత్రికి తెలంగాణ ఆత్మ లేదని విమర్శించటాన్ని చూసినప్పుడు రాజకీయంగా ఉన్న పంచాయితీ కనిపిస్తుంది. రాష్ట్ర ఏర్పాటు జరిగి పదేళ్లు పూర్తైన తర్వాత కూడా ఇంకా ఆ సెంటిమెంట్ ను రగల్చాలని చూడటం దేనికి నిదర్శనం? అంతవరకు ఎందుకు.. తెలంగాణ కలల ప్రాజెక్టుగా కేసీఆర్ అభివర్ణించే కాళేశ్వరం ప్రాజెక్టును రూపొందించిన సంస్థ మేఘా ఆంధ్రా ప్రాంతానికి చెందినదే కదా? మరి.. ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నట్లు? అని ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది?

కొన్ని పనులకు ప్రాంతాలకు ముడిపెట్టటం సరికాదు. ప్రతిభ ఎక్కడ ఉండే అక్కడ ప్రోత్సహించాలే కానీ.. దానికి సెంటెమెట్ సెంట్ పూయటంలో అర్థం లేదన్నది మర్చిపోకూడదు.రాజకీయం చేసేందుకు చాలానే అంశాలు ఉన్నప్పటికీ.. వాటిని వదిలేసి.. ఇలాంటి లాజిక్ లేని అంశాల్ని తెర మీదకు తీసుకురావటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా సమంతను ఎందుకు ఎంపిక చేసినట్లు? ఆమెకు తెలంగాణకు ఏం సంబంధం ఉంది? ఆ మాటకు వస్తే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న మహిళలు ఎవరూ లేరా? వారిని వదిలేసి.. తమిళనాడుకు చెందిన ఒక సినీ నటిని బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసింది ఎవరు? ఇలా చూసుకుంటూ పోతే.. పదేళ్ల సారు పాలనలో తెలంగాణ ప్రాంతానికి సంబంధం లేని ఎంతో మందిని ఎంపిక చేసిన వైనాలు కనిపిస్తాయి. వాటికి సమాధానం చెప్పిన తర్వాత.. కవిత ఈ తరహా వాదనను వినిపిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.