ఇవన్నీ సెట్ చేశాకే.. ఎవరి ఊళ్లకు వారిని పంపిస్తారట

ఇంటర్వ్యూకు వచ్చి ఒకరు.. ఎగ్జామ్ కు వచ్చి మరొకరు.. ఫంక్షన్ కు వచ్చి ఇంకొకరు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. దేశంలోని లక్షలాది మంది లాక్ డౌన్ పుణ్యమా అని ఊరు కాని ఊళ్లో చిక్కుకుపోవటం తెలిసిందే.

ఇంటికి దూరంగా.. ఇన్నేసి రోజులు ఉండని ఎంతోమంది ఇబ్బందిగా ఉన్నా.. తప్పనిసరిగా తమకేమాత్రం అనుకూలంగా లేని చోట్ల ఉండిపోవాల్సిన దుస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఉపాధి కోసం ఒకరాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి వెళ్లే వేలాదిమంది వలసకూలీలు..కార్మికుల పరిస్థితి మరింత దారుణం.

వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊళ్లకు వెళ్లలేక.. అలా అని ఉన్నచోట ఉండలేక.. ఉపాధి లేక.. ఆకలితో పడుతున్న పాట్లు అన్నిఇన్నికావు. ఇలాంటి కష్టాలు ఇంకెన్నిరోజులు భగవంతుడా? అన్న ప్రశ్నకు కేంద్రం తాజాగా స్పందించింది. ఎవరి ఊళ్లకు వారు వెళ్లేందుకు వీలుగా అనుమతులు ఇవ్వటంతో పాటు.. అందుకు తగ్గ కసరత్తుల్ని రాష్ట్రాల్ని షురూ చేయమంది.

ఇప్పటికిప్పుడు ప్రజారవాణా (విమానాలు.. రైళ్లు.. బస్సులు) నడిచే వీలు లేని వేళ.. ప్రత్యేక ఏర్పాట్లు చేయటం ద్వారా ఊళ్లకు తరలించనున్నారు. ఇందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఇంతకూ.. వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని వారి స్వస్థలాలకు ఎలా చేరుస్తారు? అందుకు తగ్గ కసరత్తు ఎలా జరగనుంది? ఏ ప్రాతిపదికన ఊళ్లకు పంపేలా అధికారులు నిర్ణయం తీసుకుంటారు? లాంటి ప్రశ్నలకు కచ్ఛితమైన సమాధానాలు లేవు.

అయితే.. ఇలాంటి ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభించనుంది. కాకుంటే.. ఊళ్లకు తరలించే వారి విషయంలో కొన్ని విషయాల్లో ఏం చేయాలన్న అంశంపై క్లారిటీ వచ్చేసిందని చెప్పాలి. వేరే ఊళ్లకు వెళ్లేందుకు అనుమతించే వారిని ముందుగా స్క్రీనింగ్ చేస్తారు. కరోనా లక్షణాలు కనిపించని వారినే ప్రయాణానికి అనుమతిస్తారు. రవాణాకు బస్సుల్ని మాత్రమే ఉపయోగిస్తారు.
ప్రయాణానికి ముందుగా బస్సుల్ని పూర్తిస్థాయిలో శానిటైజ్ చేస్తారు. సీట్లలో భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకుంటారు.

ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి కూలీలు.. వలస కార్మికులు.. ఇతరులు వెళ్లటానికి వీలుగా వారు ప్రయాణించే మార్గంలోని రాష్ట్రాల వారు సహకారం అందించాలి. తమ గమ్యస్థానాలకు చేరుకున్న తర్వాత స్థానిక అధికారులు.. వారికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి.. వారందరిని హోం క్వారంటైన్ చేయాలి. అలా కాదనుకుంటే.. అందరికి పూర్తిస్థాయి క్వారంటైన్ కేంద్రాలకు పంపి.. అక్కడ వారిపై నిఘా పెట్టాలని. వారి ఆరోగ్యాన్ని తరచూ పరిశీలించాలి. క్వారంటైన్ గడువు పూర్తి అయ్యాక వారిని ఇళ్లకు వెళ్లేందుకు అనుమతించాలి.

కేంద్రం ప్రయాణాలకు అనుమతి ఇచ్చినా.. మిగిలిన ఏర్పాట్లు జరగటానికి.. ఎవరు ఏయే ప్రాంతాలకు వెళ్లాలన్న విషయాన్ని తేల్చేందుకు.. అందుకు తగ్గ రవాణా సదుపాయాన్ని ఏర్పాటు చేసేందుకు కొంత సమయం పడుతుందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన నియమావళిని రానున్న రెండు..మూడు రోజుల్లో విడుదల చేసే వీలుందన్న మాట వినిపిస్తోంది.