మళ్లీ పాత చంద్రబాబు ఎంట్రీ ఇచ్చేసినట్టేనా..?

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అప్పుడెప్పుడో తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో తొలి సారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పుడు సాగించిన పాలనను మళ్లీ మనం చూడబోతున్నాం. అందుకోసం మనం కేవలం ఈ ఏడాది అక్టోబర్ దాకా ఆగితే చాలు. పాత చంద్రబాబు మన కళ్ల ముందు కదలాడతారు. నాటి మాదిరే అధికారులు ఉరుకులు పరుగులు పెడతారు. ఎక్కడి సమస్యలు అక్కడే… అక్కడికక్కడే పరిష్కారం అయిపోతాయి. పరిసరాలన్నీ పరిశుభ్రంగా మారిపోతాయి. అధికార యంత్రాంగం బాధ్యతతో మెలగడం మొదలు అవుతుంది. ఈ మాటలన్నీ వినడానికి కాస్తంత ఇబ్బంది కరంగా అనిపించినా… చంద్రబాబే స్వయంగా చెప్పిన తర్వాత కూడా అవునా?.. నిజమా?.. అని అనుమానపడాల్సిన అవసరం లేదు.

ఒక్కసారి మనం చంద్రబాబు తొలిసారి సీఎం అయిన 1995లోకి వెళ్లిపోదాం పదండి. నాడు జిల్లాలు, గ్రామాల పర్యటనకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు… ఫలానా రోజు తాను ఎక్కడికి వస్తున్నానన్న విషయాన్ని అధికారులకు తెలియనిచ్చేవారు కాదు. పొద్దున్నే రెడి అయి బయటకు వచ్చిన చంద్రబాబు కారో, లేదంటో హెలికాఫ్టరో ఎక్కిన తర్వాతే… తాను ఎక్కడికి వెళతానన్న విషయాన్ని చెప్పేవారు. ఆ తర్వాత నేరుగా అక్కడికి చేరుకునే వారు. అక్కడి పరిస్థితులపై అక్కడి అధికార యంత్రాంగంతో సమీక్ష చేసేవారు. తప్పొప్పులను అక్కడికక్కడే చెప్పేసేవారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులను అక్కడికక్కడే సస్పెండ్ చేసిన దాఖలాలూ ఉన్నాయి.

ఫలితంగా చంద్రబాబు పర్యటనకు బయలుదేరుతున్నారంటే.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ అధికారులు అప్రమత్తంగా ఉండేవారు. ఈ తరహా తీరుపై ఓ మోస్తరు విమర్శలు వచ్చినా.. ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా సాగిన చంద్రబాబు… దానిని అలాగే కొనసాగించారు.

తాజాగా శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులతో ముచ్చటించిన చంద్రబాబు.. ఆ తర్వాత అధికారులు, ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు నోట నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు వినిపించాయి.

ఈ అక్టోబర్ 2 నుంచి తాను ఆకస్మిక తనిఖీలకు వస్తానని ఆయన చెప్పారు. అయితే ఏ గ్రామానికి వస్తున్న విషయాన్ని మాత్రం తాను ముందుగా చెప్పనని… హెలికాఫ్టర్ ఎక్కిన తర్వాతే దానిని ఎక్కడ దింపాలన్న విషయాన్ని చెబుతానని ఆయన అన్నారు. కేవలం తన వద్ద పనిచేసే అధికారులకు కూడా కేవలం 2 గంటల ముందుగానే తాను వెళ్లాలనుకుంటున్న ప్రాంతం వివరాలు ఇస్తానన్నారు. అంటే… 1995నాటి చంద్రబాబును మీరు చూస్తారంటూ ఆయన సంచలన వ్యాఖ్య చేశారు.