తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. సమావేశాల్లో మూడో రోజైన శనివారం సభ ప్రారంభం కాగానే… గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఇటీవలే కేసీఆర్ గురించి ప్రసంగిస్తూ స్టేచర్, స్ట్రెచర్, మార్చురీ అంటూ తాను చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థించుకున్నారు.
గతంలో అధికార పార్టీగా ఉన్న బీఆర్ఎస్ కు అధికార పార్టీగా స్టేచర్ ఉండేదని, అయితే 2023 ఎన్నికల్లో ఆ స్టేచర్ ను తనకిచ్చిన ప్రజలు… బీఆర్ఎస్ ను స్ట్రెచర్ మీదకు చేర్చారని అన్నారు. ఆ తర్వాత 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ కు సున్నా సీట్లు ఇచ్చిన ప్రజలు బీఆర్ఎస్ ను మార్చురీకి పంపారన్నారు. మొన్న తాను అన్నది కూడా ఇదేనని చెప్పిన రేవంత్… ఓ వ్యక్తి గురించి తాను ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తానని అన్నారు.
తానేదో కేసీఆర్ ను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేసినట్లుగా బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావులు నానా యాగీ చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. అయినా కేసీఆర్ నిండా నూరేళ్ల ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని తాను కోరుకుంటున్నానని కూడా ఆయన అన్నారు. ఓ పార్టీ గురించి తాను చేసిన వ్యాఖ్యలను వ్యక్తికి ఎలా ఆపాదిస్తారని ఆయన ప్రశ్నించారు.
అయినా తాను ఇప్పుడు సీఎంగా అధికార పార్టీ స్టేచర్ లో ఉన్నానన్న రేవంత్… ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ స్థానం కోసం హరీశ్ రావు, కేటీఆర్ లు పోట్లాడుకుంటారేమో గానీ…ఆ పదవి కోసం తానెందుకు పోటీ పడతానని అన్నారు. వందేళ్ల పాటు కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేతగానే ఉండాలని కోరుకుంటానని.. అదే సమయంలో వందేళ్ల పాటు సీఎంగా తాను కేసీఆర్ ఇచ్చే సూచనలతో మంచి పాలన సాగించాలని భావిస్తున్నానని వ్యాఖ్యానించారు.
ఇక తెలంగాణకు ఎవరు అన్యాయం చేశారన్న విషయంపై తాను చర్చకు సిద్ధమేనని ప్రకటించిన రేవంత్… ఆ చర్చకు కేసీఆర్ రావాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉండగా… తెలంగాణకు అన్యాయం చేశారని ఆయన కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి చెందిన రోజా ఇంటిలో చేపల పులుసు తిన్న కేసీఆర్… రాయలసీమను రతనాల సీమ చేసే విషయంలో సహకరిస్తానని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను రేవంత్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
రోజా ఇంటిలో ఓ పూట చేపల పులుసు తింటేనే… రాయలసీమను రతనాల సీమ చేస్తానన్న కేసీఆర్… 71 ఏళ్ల పాటు పెంచి పోషించిన తెలంగాణకు కేసీఆర్ ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. తాను స్థానికుడు కాకున్నా పాలమూరు ప్రజలు ఓట్లేసి గెలిపించి పార్లమెంటుకు పంపితే… కేసీఆర్ పాలమూరు జిల్లాను ఎండగట్టారని కూడా రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా వాస్తవాలను తెలుసుకోవాలని ఆయన కేసీఆర్ సహా బీఆర్ఎస్ నేతలకు సూచించారు.
ఇక అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు అవుతున్న కేసీఆర్ తీరుపైనా రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటిదాకా గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్… వేతనాల కింద రూ.57 లక్షలకు పైగా తీసుకున్నారని ఆయన అన్నారు. ఓ ఎమ్మెల్యేగా వేతనం తీసుకుంటున్న కేసీఆర్… ఇప్పటిదాకా సభకు రెండంటే రెండు సార్లు మాత్రమే వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ అసెంబ్లీకి రావాలని… పాలనలో పదేళ్ల అనుభవం కలిగిన కేసీఆర్ తమకు సలహాలు, సూచనలు ఇవ్వాలని కూడా రేవంత్ కోరారు. ఆ గురుతర బాధ్యతను మరిచి కేసీఆర్ వ్యవహరించడం సరికాదని ఆయన ప్రశ్నించారు. పదేళ్ల కాలంలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బీఆర్ఎస్ సర్కారు సర్వ నాశనం చేసిందన్నారు. పదేళ్ల పాటు సీఎంగా ఉన్న కేసీఆర్ ఏనాడైనా యూనివర్సిటీలకు వెళ్లారా? అని ఆయన నిలదీశారు. మొత్తంగా బీఆర్ఎస్ పక్షానికి నోట మాట రాకుండా రేవంత్ రెడ్డి సుదీర్గ ప్రసంగాన్ని చేశారు.