పవన్ ప్రసంగంతో ఉప్పొంగిన చిరంజీవి!

జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆ పార్టీ అదినేత పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం పరిధిలోని చిత్రాడలో జయకేతనం పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వేదికపై నుంచి పవన్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ ప్రసంగం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు తమిళనాడు,కర్ణాటక, మహారాష్ట్రల ప్రజలు కూడా రాత్రి పొద్దుపోయేదాకా టీవీ తెరలకే అతుక్కుపోయారు. వారిలో పవన్ సోదరుడు, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. ఈ వేడుకల్లో చిరు నేరుగా పాల్గొనకున్నా.. సభను సాంతం ఆయన లైవ్ లో వీక్షించారు. పవన్ స్పీచ్ ను చూసి ఆయన ఉప్పొంగిపోయారు.

పవన్ కల్యాణ్ సుదీర్ఘంగా ప్రసంగించిన తీరు నిజంగానే అందరినీ ఆకట్టుకుంది. ఎక్కడ కూడా తడబడకుండా.. ఆయా అంశాలపై లోతైన విశ్లేషణతో ఆయన చేసిన ప్రసంగం.. ఎంతో పరిణతి సాధించిన నేతను పవన్ లో చూపించింది. ఈ ప్రసంగాన్ని సాంతం విన్న చిరంజీవి… పవన్ అలా తన ప్రసంగాన్ని ముగించారో, లేదో… ఇలా సోషల్ మీడియాను తెరచిన చిరు… పవన్ ప్రసంగం తనను ఎంతలా మెస్మరైజ్ చేసిందన్న విషయాన్ని తెలియజేశారు. మై డియర్ బ్రదర్ అంటూ ఆ సందేశాన్ని ప్రారంభించిన చిరంజీవి…జనసేన జయకేతన సభలో నీ స్పీచ్ కి మంత్రముగ్ధుడినయ్యాను అంటూ చిరు తన మనసులోని మాటను బయటపెట్టారు.

అంతటితోనే ఆగని చిరంజీవి… సబకు వచ్చిన అశేష జన సంద్రం మాదిరే తన మనసు కూడా ఉప్పొంగిందని కూడా చిరు పేర్కొన్నారు. ఈ ప్రసంగం వింటే.. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే నాయకుడు వచ్చాడన్న నమ్మకం మరింత బలపడిందని కూడా చిరు తన సందేశంలో ప్రస్తావించారు. ప్రజా సంక్షేమం కోసం ఉద్యమస్ఫూర్తితో నీ జైత్రయాత్రను నిర్విఘ్నంగా కొనసాగాలని ఆశీర్వదిస్తున్నానంటూ… తన సోదరుడికి చిరు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. జన సైనికులందరికీ చిరు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పోస్టు సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో పోస్ట్ అయిన ఈ సందేశం శనివారం ఉదయానికి కూడా వైరల్ గానే కొనసాగుతోంది.