జనసేన ఆవిర్భావ సభా వేదిక మీద నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చాలా విషయాలను ప్రస్తావించారు. కొన్ని విషయాలను అలా స్పృశించి వదిలేసిన పవన్… కొన్ని కీలక, సమకాలీన అంశాలపై మాత్రం తనదైన శైలిలో పూర్తి స్థాయిలో తన వాదనను వినిపించారు. ఈ సందర్భంగా త్రిభాషా విధానం, డీలిమిటేషన్ లను వ్యరేతికేస్తూ ఏకంగా కేంద్ర ప్రభుత్వంపై పోరాటాన్నే ప్రకటించిన తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే,ఆ పార్టీ అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ లకు పవన్ తనదైన శైలి స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు.
భారత దేశం భిన్న సంస్కృతులు, బిన్న జాతులు, భిన్న మతాలు, భిన్న ఆచారాల మేళవింపు అన్న పవన్… మరి భిన్నత్వంలో ఏకత్వంగా సాగుతున్న దేశంలో త్రిభాషా విధానం ఎందుకు వద్దని ప్రశ్నించారు. ఇంకా చెప్పాలంటే … త్రిభాషా సిద్ధాంతాన్ని బహుభాషా సిద్ధాంతంగా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాషగా హిందీని తమిళ పార్టీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. ఈ తరహా వాదనలు తప్పని కూడా ఆయన పేర్కొన్నారు. హిందీ వద్దనుకున్నప్పుడు తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేయొద్దని పవన్ అన్నారు. హిందీ భాష వద్దనుకున్నప్పడు… ఆ భాష మాట్లాడే రాష్ట్రాల నుంచి డబ్బులెందుకు ఆశిస్తారని ఆయన ఓ మంచి లాజిక్ ను ప్రస్తావించారు.
ఇక డీలిమిటేషన్ విషయంలోనూ ఉత్తరాది, దక్షిణాది అంటూ దేశాన్ని వేరు చేసి మాట్లాడుతున్న వైనాన్ని కూడా పవన్ తప్పుబట్టారు. అసలు సమస్య ఏమిటన్న దానిని విస్మరించి… దేశాన్ని విభజించేసి చూడటం ఏమిటన్నారు. డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నష్టమేమిటన్న దానిపై చర్చించాల్సిన అవసరాన్ని పక్కనపెట్టేసి… కేంద్రం ఏదో చేస్తోందని… రూపాయి సింబల్ ను తమిళనాడు మార్చేయడమేమిటని ఆయన నిలదీశారు. ఈ లెక్కన ఏపీ, కర్ణాటకలు కూడా తమ కరెన్సీ గుర్తులను మార్చుకోవాలా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా డీఎంకే పేరు గానీ, స్టాలిన్ పేరు గానీ ప్రస్తావించకుండానే పవన్ వారి వాదనలను తూర్పారబట్టారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates