ఏపీ బీజేపీలో విధి వంచితుడు ఎవరైనా ఉన్నారంటే అది కన్నా లక్ష్మీనారయణే అని చెప్పాలి. గతంలో కానీ, ఇప్పుడు కానీ చాలామంది తాము పార్టీ కోసం చేసిన కంటే ఎక్కువే పదవుల రూపంలో ప్రయోజనం పొందినవారున్నారు. కానీ.. కన్నా పరిస్థితి వేరు. కాంగ్రెస్ కుప్పకూలిన తరువాత బీజేపీలోకి వచ్చిన ఆయనకు పార్టీ అధ్యక్ష పదవి రూపంలో మంచి పదవే వరించింది. కానీ.. ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది ఆయనకు. రాజ్యసభ పదవి ఆశించిన ఆయనకు నిరాశే మిగిలింది. పార్టీ కోసం ఆయన బాగానే ఖర్చు చేశారనీ చెబుతారు.
అయితే… నిత్య ఫిర్యాదుల కారణంగా అధిష్ఠానం ఆయన్ను పక్కన పెట్టి సోము వీర్రాజుకు అధ్యక్ష పదవి కట్టబెట్టింది. కన్నా ఉన్నప్పుడు పార్టీ ఉత్సాహంగా కదిలింది అని ఇప్పుడు నేతలంతా అనుకుంటున్నారు. అధిష్ఠానం కూడా కొంత వరకు అలాంటి ఆలోచనతోనే ఉందట. అందుకే ఆయన్ను రాజ్యసభకు పంపే యోచన చేస్తోందని తెలుస్తోంది.
రానున్న నవంబరులో ఉత్తరప్రదేశ్ నుంచి 10 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అందులో మూడు బీజేపీవి కాగా నలుగురు సమాజ్ వాది పార్టీ, ఇద్దరు బీఎస్పీ, ఒకరు కాంగ్రెస్ సభ్యుడు. యూపీ అసెంబ్లీలో నాలుగింట మూడొంతుల సీట్లు బీజేపీవే. 403 సీట్లున్న యూపీ అసెంబ్లీలో 312 సీట్లు బీజేపీవి కాగా సమాజ్ వాది పార్టీకి 47, కాంగ్రెస్‌కు 7, బీఎస్పీకి 19 సీట్లున్నాయి. ఈ లెక్కన సమాజ్‌వాది , కాంగ్రెస్ పార్టీలు ఎంత ప్రయత్నించినా కూడా రెండు రాజ్యసభ సీట్లను మించి సాధించలేవు. కాబట్టి బీజేపీకి 8 రాజ్యసభ సీట్లు రావడం ఖాయం.
అంటే.. ఇప్పుడున్న మూడుకు అదనంగా మరో అయిదు కలుస్తున్నాయి. దీంతో సిటింగ్ సభ్యులను పొడిగించడంతో పాటు అదనంగా మరో అయిదుగురికి అవకాశం ఇవ్వొచ్చు. ఈ అయిదులో మూడు ఉత్తర ప్రదేశ్ నేతలకే ఇచ్చినా ఒకటి బీజేపీకి ఆశలు బలంగా ఉన్న తెలంగాణకు, మరొకటి ఆంధ్రకు ఇవ్వాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అలా యూపీ కోటాలో రాజ్యసభ ఎంపీ పదవి ఏపీకి వచ్చే అవకాశం ఉంది. అయితే.. ఈ పదవి కోసం కన్నాతో పాటు మరికొందరు నేతలూ పోటీ పడుతున్నారు. కానీ, కన్నాకే ఎక్కువ అవకాశాలున్నాయని తెలుస్తోంది. పురంధేశ్వరి కూడా రాజ్యసభ పదవి ఆశిస్తున్నప్పటికీ ఆమెకు జాతీయ కార్యదర్శి పదవి ఇవ్వడంతో ఇప్పుడు రాజ్యసభ అవకాశం ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఏపీలో కమ్మ సామాజికవర్గం టీడీపీ వైపు, రెడ్డి సామాజికవర్గం వైసీపీ వైపు ఉండడంతో కాపు సామాజికవర్గాన్ని ఆకర్షించే పనిలో ఇప్పటికే తలమునకలైన బీజేపీ కన్నాకు రాజ్యసభ పదవి ఇచ్చి కాపులను మరింతగా ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నట్లుగా చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates