బీజేపీ సీనియర్ నాయకుడు, ఘోషా మహల్ ఎమ్మెల్యే, వివాదాలకు కేంద్రంగా ఉన్న రాజా సింగ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఆయన ఎప్పుడు ఏ వ్యాఖ్యలు చేసినా వివాదాలతోనే ముడిపడి ఉంటాయి. ముఖ్యంగా ఓ సామాజిక వర్గాన్ని, మతాన్ని టార్గెట్ చేసుకుని ఆయన వ్యాఖ్యలు సంధిస్తారు. అయితే.. ఈ సారి మాత్రం సొంత పార్టీపైనే నిప్పులు చెరిగారు. బీజేపీలో పాత సామాన్లు అంటూ.. సంచలన విమర్శలు చేశారు.
బీజేపీలో పాత సామాన్లు పెరిగిపోతున్నాయి. వీటిని చెత్తబుట్టలో పడేయాల్సిన అవసరం వచ్చింది. ఎవరికి వారు గొప్పులు పోతున్నారు. వీరివల్ల పార్టీకి ఏమైనా ప్రయోజనం ఉందా
అని సీనియర్ నాయకులను ఉద్దేశించి రాజాసింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పేరు బయటకు చెప్పకపోయినా.. రాష్ట్ర బీజేపీ సారథి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో రాజా సింగ్ చాలా కాలంగా విభేదిస్తున్నారు. తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆయన గురించేనన్న చర్చ వినిపిస్తోంది.
అంతేకాదు.. బీజేపీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్న రాజా సింగ్.. కొత్త వారికి అవకాశం ఇవ్వాల ని సూచించారు. లేకపోతే.. బూజుపట్టి తప్పు కంపు కొడుతుందన్నారు. అయితే.. తాను ఎవరినీ ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయడం లేదని.. పార్టీ మేలు కోరి చెబుతున్నానని ఆయన తెలిపారు. పార్టీలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. అలా కాకుంటే.. పార్టీ ఎప్పటికీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పార్టీ అధిష్టానం ఏం చేస్తోందో నాకు తెలియదు. కానీ, ఆలోచన చేయాలని మాత్రం చెబుతున్నారు. ఎవరికి వారు గొప్ప వాళ్లుగా చలామణి అయితే.. కొత్తవారికి అవకాశం ఎప్పుడు ఇస్తారు. ఎప్పుడు పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ విషయంపై అధిష్టానం దృష్టి పెట్టాలి. పాతవారిని బలవంతంగా అయినా.. రిటైర్ చేయించాలి. అప్పుడు మాత్రమే పార్టికి మనగడ ఉంటుంది
అని రాజాసింగ్ చెప్పారు.