బాబుతో నాగం భేటీ… ఎన్నెన్ని తీపి గురుతులో?

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును గురువారం తెలంగాణకు చెందిన సీనియర్ మోస్ట్ రాజకీయ నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి కలిశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లో కొనసాగుతున్న నాగం రాజకీయంగా అయితే పెద్దగా యాక్టివ్ గా లేరనే చెప్పాలి. అయితే చంద్రబాబుతో కలిసి తెలుగు నేలలో నాగం చేసిన రాజకీయాలు ఇప్పటికీ గుర్తున్నాయి. తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో నాగం కూడా చంద్రబాబు చేతిలోని టీడీపీలోనే కొనసాగారు. కొనసాగడమే కాదు టీడీపీలో నాగంది క్రియాశీలక భూమికేనని చెప్పాలి. మంత్రిగా, పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా, పార్టీ విపక్షంలో ఉండగా… అధికార పార్టీని నిలదీసే క్రమంలో చంద్రబాబు దన్నుగా నిలవడంలో నాగం కీలక భూమిక పోషించారు.

నాడు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఓబుళాపురం అక్రమ మైనింగ్ పై టీడీపీ పెద్ద ఎత్తున ఉద్యమించింది. టీడీపీ పోరాటంతో అఖిలపక్ష బృందం ఓబుళాపురం మైనింగ్ ను పరిశీలించింది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాల క్రమంలో ఆ బృందానికి నేతృత్వం వహించిన నాగంపై కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసులు విజయవాడలోని ప్రజా ప్రతినిధుల కోర్టులో విచారణ జరిగింది. కేసుల విచారణను ముగించిన కోర్టు… వాటిని కొట్టేసింది. ఈ మేరకు కోర్టు తుది తీర్పును గురువారం వెలువరించగా…నాగం స్వయంగా హాజరు అయ్యారు. అనంతరం చంద్రబాబు వద్దకు ఆయన వెళ్లారు. తనను కలిసేందుకు వచ్చిన నాగంను చంద్రబాబు ఆత్మీయంగా పలకరించారు.

ఈ సందర్భంగా నాగంను చూసిన వెంటనే చంద్రబాబు కళ్లల్లో కనిపించిన వెలుగు… అదే సమయంలో తన మార్గదర్శకుడి వద్దకు వచ్చానన్న భావన నాగంలో వ్యక్తమయ్యాయి. అనంతరం నాగం బాగోగులను ఆరా తీసిన చంద్రబాబు నాగం పిల్లల గురించి అడిగారు. ఈ సందర్భంగా గతంలో వారిద్దరూ కలిసి చేసిన రాజకీయాలు…ఉమ్మడిగా చేపట్టిన చర్యల గురించి వారు మననం చేసుకున్నారు. ఆఫ్రో ఏసియన్ గేమ్స్ ను నిర్వహించిన సమయంలో అక్కడి అన్ని బాధ్యతలను నాగం భుజాల మీదే పెట్టగా… నాగం కూడా తన సత్తా చాటి గేమ్స్ ను దిగ్విజయంగా ముగించారు. చంద్రబాబు కేబినెట్ లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగానూ నాగం పనిచేశారు. వయసు మీద పడటంతో నాగం నడవడానికే ఇబ్బంది పడుతుండగా… చంద్రబాబు మాత్రం ఇంకా హుషారుగానే కనిపిస్తుండటం గమనార్హం.