తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రెండో రోజే రచ్చ చోటుచేసుకుంది. ఓ చిన్న వివాదం చిలికి చికిలి గాలి వానలా మారి..ప్రదాన ప్రతిపక్షానికి చెందిన సభ్యుడిపై బహిష్కరణ వేటు వేసే దాకా పరిస్థితి వెళ్లింది. ఆపై స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విపక్షం అసెంబ్లీకి సమీపంలో.. సచివాలయం పక్కనే ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు… బలవంతంగా బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకుని వారి పార్టీ కార్యాలయం వద్ద వదిలిపెట్టారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన వైనం ఆసక్తి రేకెత్తించింది.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభం కాగా.. గవర్నర్ ప్రసంగంతో తొలిరోజు సమావేశం ముగిసింది. ఇక రెండో రోజైన గురువారం సభ ప్రారంభం కాగానే…గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ప్రారంభమైంది. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ ల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఈ క్రమంలోనే అసెంబ్లీ మీ సొంతమేమీ కాదంటూ స్పీకర్ గెడ్డం ప్రసాద్ ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుండకంట్ల జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో ఒక్కసారిగా మంటలను రాజేసింది. జగదీశ్ రెడ్డి క్షమాపణలు చెప్పాల్సిందేనని అధికార పక్షం పట్టుబట్టింది. దళిత సామాజిక వర్గానికి చెందినందుననే స్పీకర్ ప్రసాద్ పై జగదీశ్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మరోమారు అవే వ్యాఖ్యలను జగదీశ్ రెడ్డి చేయడంతో ఆయనను సభ నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.
అధికార పక్షం తీసుకున్న ఈ నిర్ణయాన్ని విపక్ష బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. కనీసం తమ వాదనను వినిపించేందుకు కూడా అవకాశం ఇవ్వలేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, మరో మాజీ మంత్రి హరీశ్ రావులు నిప్పులు చెరిగారు. జగదీశ్ రెడ్డిని వెంటబెట్టుకుని బీఆర్ఎస్ సభ్యులంతా అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి అక్కడే బైఠాయించి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాసేపటికి అక్కడికి చేరుకున్న పోలీసులు బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకుని వ్యాన్ ఎక్కించారు. అయితే ఓ వైపుగా జారుకున్న హరీశ్ రావు తిరిగి అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని మరోమారు నిరసనకు దిగారు. ఈ క్రమంలో మిగిలిన నేతలను ఎక్కించిన వ్యాన్ అప్పటికే కదిలిపోగా…హరీశ్ రావు కోసం మరో వ్యాన్ ను ప్రత్యేకంగా తెప్పించాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే… జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ ను వ్యతిరేకిస్తూ రేపు తెలంగాణ బంద్ కు బీఆర్ఎస్ పిలుపు ఇచ్చింది.