లోగుట్లు బ‌య‌ట‌కు.. జ‌గ‌న్‌కు ఇర‌కాటం ..!

లోగుట్టు పెరుమాళ్ల కెరుక‌.. అనేది ఓల్డు సామెత‌. కానీ, ఇప్పుడు రాజ‌కీయాల్లో లోగుట్లు.. అన్ని పార్టీల్లోనూ కీల‌క నాయ‌కులకు తెలిసే జ‌రుగుతున్నాయి. అవి రాజ‌కీయ వ్యూహాలైనా.. ఆస్తులకు సంబంధించిన వ్య‌వ‌హారాలైనప్ప‌టికీ.. పార్టీ అధినేతల వ్య‌వ‌హారాలు కీల‌కనేత‌లకు తెలిసే జ‌రుగుతున్నాయి. దీంతో నాయ‌కుల‌పై పార్టీ అధినేత‌లు, అధిష్టానాలు కూడా ఓ క‌న్నేసి ఉంటున్నాయి. ఏ చిన్న తేడా వ‌చ్చినా.. స‌ద‌రు నాయ‌కులు యాంటీ అయితే.. ఇబ్బందేన‌ని గ్ర‌హిస్తున్నారు.

ఇదిలావుంటే.. ఇప్పుడు ప్ర‌తిప‌క్ష వైసీపీ లోగుట్లు బ‌య‌ట‌కు వ‌చ్చేసే ప్ర‌మాదం పొంచి ఉంద‌న్న చ‌ర్చ సాగుతోంది. పార్టీలోనేకాకుండా.. అధిష్టానం వ‌ద్ద కూడా.. బ‌ల‌మైన నాయ‌కుడిగా ఎదిగిన‌.. మాజీ నాయ‌కు డు సాయిరెడ్డి బ‌య‌ట‌కు వ‌చ్చారు. అయితే..ఇప్పుడు ఉన్న‌ది ఉన్న‌ట్టు చెప్పేస్తున్నారు. ప్ర‌స్తుతం కాకినా డ సీపోర్టు వ్య‌వ‌హారంలో ఆయ‌న వాంగ్మూలం వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డికి ప్రాణం సంక టంగా మారిపోయింది. ఆయ‌న పాత్ర‌పై ఉన్న అనుమానాలు నిజం కానున్నాయి.

ఈ ప‌రిణామం.. వైసీపీని తీవ్ర ఇర‌కాటంలోకి నెట్టేసింది. ఇక‌, ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. వైసీపీ అధినే త జ‌గ‌న్‌కు చెందిన ఆస్తులు, ఇత‌ర కేసుల్లోనూ సాయిరెడ్డి ముద్దాయిగా ఉన్నారు. అటు వ్యాపారాల‌కు, ఇటు రాజ‌కీయాల‌కు సంబంధించిన అన్ని లెక్క‌ల‌ను సాయిరెడ్డే చూశారు. ఆయ‌నకు ప్ర‌తి విష‌యం తెలుసు. రేపు ఈ కేసుల్లోనూ ఆయ‌న యూట‌ర్న్ తీసుకుని నిజాలు చెప్పే అవ‌కాశం, త‌న‌ను తాను అప్రూవ‌ర్‌గా మార్చుకునే అవ‌కాశం క‌నిపిస్తున్నాయి.

ఇదే జ‌రిగితే.. ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ఉన్న ప‌రిస్థితి ఒక లెక్క అయితే.. ఇక నుంచి మ‌రో లెక్క‌.. అన్న‌ట్టుగా ప‌రిస్థితి మారిపోనుంది. దీనిపై పార్టీలో తీవ్ర చ‌ర్చే సాగుతోంది. వాస్త‌వానికి నాయ‌కుల‌ను కాపాడుకునే ప్ర‌య‌త్నం చేసేది ఇందుకే. త‌మ గుట్లు బ‌య‌ట‌కు రాకుండా.. నాయ‌కులు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. కానీ, సాయిరెడ్డి వంటి కీల‌క నాయ‌కుడి విష‌యాన్ని కూడా.. జ‌గ‌న్ లైట్ తీసుకున్నారు. ఫ‌లితంగా ఇప్పుడు ఆయ‌న డేంజ‌ర్ బెల్స్ మోగిస్తే..ఇరుకున ప‌డేది జ‌గ‌నేన‌ని తెలుస్తోంది.