ఏపీ బీజేపీ నేతలపై అధిష్ఠానం నిఘా

ఏపీ బీజేపీ నేతలు అక్కడి పాలక పక్షం వైసీపీతో అంటకాగుతున్నారన్న విమర్శలు ఎక్కువవుతున్నాయి. రాజకీయంగా పాలక పక్షం, ప్రధాన ప్రతిపక్షం రెండూ కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా మైలేజ్ పెంచుకోవడానికి పాలక పక్షాన్ని టార్గెట్ చేస్తుంది. కానీ, ఏపీలో మాత్రం పాలకపక్షం వైసీపీతో సమానంగా బీజేపీ కూడా ప్రధాన ప్రతిపక్షం టీడీపీని టార్గెట్ చేస్తోంది.

ప్రభుత్వపు తప్పొప్పులను ఎత్తి చూపుతూ ప్రజల్లోకి వెళ్లడం మానేసి ప్రెస్ మీట్లు పెడుతూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన నేతృత్వంలోని గత ప్రభుత్వం చేసిన పనులను విమర్శిస్తూ రాజకీయంగా ముందుకు సాగాలనుకుంటోంది. టీడీపీ కూడా తమకు దూరంగా ఉన్న పార్టీయే అయినప్పటికీ ఆ పార్టీయే ప్రభుత్వంలో ఉందా అన్నట్లుగా ఏపీ బీజేపీ నేతలు వ్యవహరిస్తుండడం కేంద్రంలోని ఆ పార్టీ పెద్దల దృష్టికి వెళ్లిందట. పార్టీ సమావేశాలు, వ్యక్తిగత భేటీలు, వ్యక్తిగత సంభాషణలు, పార్టీ అంతర్గత కమ్యూనికేషన్లలోనూ అధిష్ఠానం దీన్ని చూచాయగా ఇప్పటికే ప్రస్తావించినప్పటికీ ఏపీ బీజేపీలోని చాలామంది నేతల తీరు మారకపోవడంతో అధిష్ఠానం వారిపై కన్నేసినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా ఏపీలో పార్టీ పెద్దగా ఉన్న నేత, రాయలసీమకు చెందిన మరో నేత, దిల్లీలో మొన్నటివరకు పదవిలో ఉన్న ఒక నేత, దిల్లీలో ఉంటూ ఏపీ వ్యవహారాలు చూడాల్సి ఉన్నా జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఏపీలోనే ఉంటూ సాక్షి పత్రికలో వైసీపీ అనుకూల వ్యాసాలు రాసుకుంటున్న ఒక నేతపై కేంద్రంలోని బీజేపీ పెద్దలు కన్నేసినట్లు తెలుస్తోంది.

దిల్లీ స్థాయిలో గళం విప్పే అవకాశం ఉన్న పదవిలో మొన్నటివరకు ఉన్న ఒక నాయకుడిని వైసీపీ బాగా చూసుకుందని.. విశాఖలో మంచి స్థిరాస్తి ప్యాకేజీ అందించిందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయం బీజేపీ దిల్లీ పెద్దల వరకు వెళ్లిందట. అక్కడి వరకు వెళ్లిందంటే ఇక్కడి వారే చేరవేశారని టాక్.

ఇక మరో నాయకుడు కూడా మనం అధికారంలోకి వస్తామో రామో వైసీపీ దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని డిసైడై గోదావరి జిల్లాలలో ఉంటూ వైసీపీ నేతలతో చెట్టపట్టాలేసుకుంటున్నారట.

రాయలసీమకు చెందిన బీజేపీ నాయకుడు కూడా వచ్చే ఎన్నికల్లో బాగుంటే బీజేపీ నుంచి లేదంటే ఇతర పార్టీల నుంచి పోటీ చేయడానికి సరిపడా డబ్బులు కూడబెట్టుకునే పనిలో పడ్డారట. ఆయనైతే బీజేపీలో ఏం జరుగుతోందో తనకు తెలిసిన సమాచారమంతా వైసీపీ చెవిలో వేస్తున్నారట.

అయితే, వీరంతా తాము కళ్లు మూసుకుని పాలు తాగుండడం ఎవరూ చూడడం లేదనుకుంటున్నా కేంద్రంలోని బీజేపీ పెద్దలు మాత్రం లైవ్‌లో చూస్తున్నారని జరుగుతున్న పరిణామాలు రుజువు చేస్తున్నాయి. దిల్లీ స్థాయిలో గళం విప్పే పదవి పోవడం ఈ లాలూచీల ఫలితమేనని రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.