నిజమేనండోయ్… దేశ రాజధానిలో ఏపీ విపక్షం వైసీపీ హవా ఎంతమాత్రం తగ్గలేదు. అధికారంలో ఉండగా… ఢిల్లీలో ఆ పార్టీ హవా ఎలా నడిచిందో… ఆ పార్టీ విపక్షంలోకి మారిపోయిన తర్వాత కూడా అదే హవాను కొనసాగిస్తోంది. ప్రత్యేకించి ఆ పార్టీనే కాకుండా రాజకీయాల నుంచే తప్పుకున్న వేణుంబాక విజయసాయిరెడ్డి ఢిల్లీలో పార్టీకి వేసిన పునాదులు ఇంకా గట్టిగానే పనిచేస్తున్నట్టున్నాయి. నాడు రాజ్యసభలో ప్యానెల్ వైస్ చైర్మన్ గా సాయిరెడ్డి వ్యవహరించగా.. ఇప్పుడు ఆ స్థానాన్ని వైసీపీ రాజ్యసభ సభ్యుడు, జగన్ కేసుల న్యాయవాది సిర్గాపూర్ నిరంజన్ రెడ్డి దక్కించుకున్నారు. నిరంజన్ రెడ్డి తెలంగాణకు చెందిన వారైనా, రాజకీయాలతో సంబంధం లేకున్నా… కేవలం తన కేసులను వాదిస్తున్న న్యాయవాదిగా ఆయనకు జగన్ ఎంపీ పదవిని కట్టబెట్టారన్న ఆరోపణలు వినిపించాయి.
ప్యానెల్ వైస్ చైర్ పర్సన్ అంటే… డిప్యూటీ స్పీకర్ పోస్టు అన్న మాట. లోక్ సభలో స్పీకర్ అందుబాటులో లేని సమయంలో డిప్యూటీ స్పీకర్… డిప్యూటీ స్పీకర్ అందుబాటులో లేకపోతే ప్యానెల్ స్పీకర్లు ఆ బాధ్యతలను నిర్వర్తిస్తే… రాజ్యసభలో ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ గా వ్యవహరిస్తారు కదా. చైర్మన్ అందుబాటులో లేని సమయంలో ప్యానెల్ వైస్ చైర్ పర్సన్ లు రాజ్యసభ వ్యవహారాలను నడుపుతారన్న మాట. అలా రాజ్యసభ ప్యానెల్ వైస్ చైర్ పర్సన్లుగా ఏకంగా 8 మందిని ఎంపిక చేస్తారు. ఆ 8 మందిలో నాడు వైసీపీ నుంచి సాయిరెడ్డి ఉంటే.. ఇప్పుడు నిరంజన్ రెడ్డి ఎంపికయ్యారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కడ్ ప్యానెల్ వైస్ చైర్ పర్సన్లను సోమవారం ఎంపిక చేశారు.
రాజ్యసభలో సీనియర్లు… లేదంటే ఎక్కువ సంఖ్యలో ఉండే పార్టీలకు చెందిన సభ్యులను ఉపరాష్ట్రపతి ప్యానెల్ వైస్ చైర్మన్లుగా ఎంపిక చేస్తూ ఉంటారు. గతంలో ఏపీలో 151 ఎమ్మెల్యే సీట్లను గెలిచిన వైసీపీ… లోక్ సభలో 22 సీట్లను గెలిచిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో రాజ్యసభలోనూ వైసీపీకి క్రమంగా సభ్యుల సంఖ్య పెరిగింది. నాడు టీడీపీ 23 సీట్లకే పరిమితం అయిన నేపథ్యంలో రాజ్యసభలో ఆ పార్టీ సభ్యుల సంఖ్య క్రమంగా జీరోకూ పడిపోయింది. ఇటీవల వైసీపికి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసిన క్రమంలో ఆ స్థానాల్లో రెండు సీట్లు టీడీపీకి దక్కాయి. ప్రస్తుతం ఆ రెండు సీట్లే రాజ్యసభలో టీడీపీకి ఉన్న బలం. అయితే ప్రస్తుతం ఇటు అసెంబ్లీలో, అటు లోక్ సభలో టీడీపీకి సంఖ్యాబలం ఓ రేంజిలో పెరిగిన నేపథ్యంలో రాజ్యసభలోనూ ఆ పార్టీ సభ్యుల సంఖ్య గణనీయంగా పెరగనుంది. అదే సమయంలో రాజ్యసభలో వైసీపీ జీరోకు పడిపోనుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates