వైసీపీ కీలక నాయకుడు, బీసీ నేత, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాసరావు అరెస్టుపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆయననే ఏక్షణంలో అయినా అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే తరువాయి అన్నట్టుగా పోలీసులు కూడా వేచి చూస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో దువ్వాడపై కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో దువ్వాడపై జనసేన నాయకులు కేసులు పెట్టారు.
గతంలో జనసేన అధినేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఆయన దూషించారని.. కాబట్టి ఆయనపై చర్యలు తీసుకోవాలని.. జనసేన నాయకులు గత పదిహేను రోజుల్లో రెండు కేసులు పెట్టారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన జనసేన నాయకుడు ఒకరు దువ్వాడపై కేసు పెట్టారు. ఎన్నికలకు ముందు పవన్‌ను అసభ్య పదజాలంతో దూషించారని ఆయన ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.
ఇక, ఇప్పటికే నమోదైన రెండు కేసులు ఉండడంతో మొత్తం విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్న ప్రభుత్వం దువ్వాడ అరెస్టుకు ఓకే అంటే.. పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకోనున్నారు. వైసీపీ హయాంలో టీడీపీ, జనసేనలపై విరుచుకుపడిన వైసీపీ నాయకుల్లో దువ్వాడ ఒకరు. జగన్ మెప్పు కోసం.. నోటికి ఎంత మాట వస్తే.. అంత మాటా అనేసి.. మీడియాలో రచ్చ రచ్చ చేశారు. అయితే.. ఇప్పుడు వారిపై కేసులు నమోదవుతున్నాయి.
ఇలాంటి కేసుల్లోనే చిక్కుకున్న పోసాని కృష్ణ మురళి.. ఇంకా కర్నూలు జైల్లోనే ఉన్నారు. మరోవైపు.. ఆయనపై.. శ్రీకాకుళం, విజయనగరంలోనూ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలా.. ఒక్కొక్కరుగా జగన్‌పై విరాభిమానంతో నోరు చేసుకున్న నాయకులు జైలు పాలవుతుండడం గమనార్హం. ఈ పరంపరలో ఇప్పుడు దువ్వాడ శ్రీను వ్యవహారం తెరమీదికి వచ్చింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates