టీడీపీలో తరంతో పాటు స్వరమూ మారుతోంది. నేటి తరానికి అనుకూలంగా రాజకీయాలు మారుతున్న నేపథ్యంలో ఆదిశగానే.. సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో కష్టమే అయినా.. కొందరు సీనియర్లను పక్కన పెట్టాల్సి వస్తోంది. ఇలాంటివారిలో తాజాగా తెరమీదికి వచ్చిన పేరు యనమల రామకృష్ణుడు. ఈయన రాజకీయాలు ప్రారంభించింది టీడీపీతోనే. అన్నగారి పిలుపుతో రాజకీయ అరంగేట్రం చేసిన రామకృష్ణుడు.. తర్వాత కాలంలో స్పీకర్‌గా, మంత్రిగా కూడా పనిచేశారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం నుంచి విజయాలు దక్కించుకున్న రామకృష్ణుడు.. వైఎస్ ప్రభావంతో 2004లో ఓడిపోయారు. ఆ తర్వాత.. మళ్లీ ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయలేదు. కానీ, చంద్రబాబుకు, ఆయనకు మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా.. 2014లో ఎమ్మెల్సీ ఇచ్చి.. మంత్రి పదవిని కూడా కట్టబెట్టారు. ఆతర్వాత.. యనమల తమ్ముడు కృష్ణుడికి అవకాశం కల్పించారు. తాజాగా గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కుమార్తె దివ్యకు వరుసగా రెండో సారి అవకాశం ఇచ్చారు.
ఈ దఫా ఎన్నికల్లో దివ్య విజయం దక్కించుకున్నారు. దీంతో యనమల కుటుంబం నుంచి యువ నాయకురాలు రంగంలోకి వచ్చినట్టు అయింది. ఇక, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న యనమల.. పదవీ కాలం ఈ నెల 29తో ముగియనుంది. అయితే.. ఈ దఫా ఆయనకు మరోసారి రెన్యువల్ ఉంటుందని అందరూ భావించారు. కానీ, కొత్తవారికి అవకాశం కల్పించాలన్న ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుతుండడంతో చంద్రబాబు యనమలను పక్కన పెట్టారు. ఈ క్రమంలోనే బీసీ యాదవ సామాజిక వర్గానికే చెందిన బీదకు అవకాశం ఇచ్చారు.
అన్నగారి నుంచి మెప్పులు-తిప్పలు!
యనమల రామకృష్ణుడుకు.. దివంగత ఎన్టీఆర్‌కు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. యువతగా ఉన్నప్పుడు యనమలను పార్టీలోకి ఆహ్వానించి టికెట్ ఇచ్చిన రామారావు.. అనేక సందర్భాల్లో బీసీల తరఫున ప్రతినిధిగా యనమలను ప్రస్తావించేవారు. బీసీలకు కీలక నాయకుడిగా ఎదుగుతాడని కూడా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే టీడీపీలో ఏర్పడిన సంక్షోభం సమయంలో స్పీకర్‌గా ఉన్న రామకృష్ణుడిని.. అసెంబ్లీలో ఎన్టీఆర్ తప్పుబట్టారు. తనకు కనీసం ఒక్క నిమిషం కూడా మైకు ఇవ్వడం లేదని.. ఇదేనా మీ విజ్ఞత అని దుయ్యబట్టారు. ఇలా.. అన్నగారి నుంచి మెప్పులు పొందిన, తిప్పలు పొందిన నాయకుడు యనమల కావడం గమనార్హం.