అమ‌రావ‌తి పై అనుమానాలొద్దు.. ఇక పరుగులే

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో ప్ర‌తిప‌క్షం వైసీపీ నాయ‌కులు సృష్టిస్తున్న విషప్ర‌చారాన్ని ప్ర‌జ‌లు నమ్మ‌రాద‌ని ఏపీ మంత్రులు కోరారు. రాజ‌ధాని కోసం వేల కోట్ల రూపాయ‌ల‌ను అప్పుగా తీసుకువ‌చ్చి పెడుతున్నార‌ని, ఈ అప్పులు ఎలా తీరుస్తార‌ని, తిరిగి ప్ర‌జ‌ల‌పై భారాలు మోపుతార‌ని గ‌త నాలుగు రోజులుగా వైసీపీ అనుకూల మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని మంత్రులు నారాయ‌ణ‌, కేశవ్‌, కందుల దుర్గేష్ ఖండించారు. రాజ‌ధాని పై జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని ప్ర‌జ‌లు న‌మ్మ‌రాద‌ని వారు సూచించారు. రాజ‌ధాని స్వ‌యంప్ర‌తి ప‌త్తి క‌లిగిన ఆర్థిక సంస్థ‌గా వారు పేర్కొన్నారు.

రాజ‌ధాని కోసం ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయినీ తిరిగి రాబ‌ట్టుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌న్నారు. పైగా రాష్ట్ర ప్ర‌జ‌లపై ఒక్క రూపాయి కూడా భారం ప‌డ‌బోద‌న్నారు. చాలా సూక్ష్మ స్థాయిలో ఆలోచించి.. రాజ‌ధానిని ప్లాన్ చేసిన‌ట్టు వివ‌రించారు. ఇక్క‌డ ఎవ‌రూ ఎవ‌రి రూపాయి పోగొట్టుకోర‌ని.. ఇది ఆర్థిక రాజ‌ధానిగా కూడా భాసిల్లుతుంద‌న్నారు. అప్పులు చేసినా.. వాటిని తీర్చు కునే సామ‌ర్థ్యం అమ‌రావ‌తికి ఉంటుంద‌న్నారు. కాబ‌ట్టి అమ‌రావ‌తి పై జ‌రుగుతున్న వ్య‌తిరేక ప్ర‌చారాన్ని ప్ర‌జ‌లు తిప్పి కొట్టాల‌ని మంత్రులు పిలుపునిచ్చారు.

మ‌రోవైపు… రాజ‌ధానిలో భూముల కేటాయింపు పై అధ్య‌య‌నం చేసిన మంత్రివ‌ర్గ స‌భ్యులు.. ఇక్క‌డ గ‌తంలో కేటాయించిన భూముల‌ను మార్పు చేయ‌డం లేద‌న్నారు. గ‌తంలో 131 సంస్థ‌ల‌కు భూములు కేటాయించ‌గా.. 31 సంస్థ‌లు వ‌చ్చాయ‌ని.. మ‌రో 13 సంస్థ‌లు వ‌ద్ద‌ని వెళ్లిపోయాయ‌ని వివ‌రించారు. అయితే.. వాటికి కేటాయించిన భూముల విష‌యంలో పెద్ద‌గా మార్పులు చేయ‌డం లేద‌న్నారు. ఇదేస‌మ‌యంలో మ‌రికొన్ని సంస్థ‌ల విజ్ఞ‌ప్తి మేర‌కు.. భూముల ప‌రిదిని విస్త‌రిస్తున్న‌ట్టు మంత్రి నారాయణ తెలిపారు. ఆయా సంస్థ‌లు సాధ్య‌మైనంత వేగంగా ప‌నులు చేప‌ట్టేందుకు అవ‌కాశం ఉంద‌న్నారు.

మ‌రో రెండు సంస్థలకు గతంలో కేటాయించిన భూములు కాకుండా వేరే చోట ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. మరో 16 సంస్థలకు స్థలంతోపాటు పరిధినీ మార్చనున్న‌ట్టు మంత్రి తెలిపారు. రైతుల నుంచి సేక‌రించిన 34 వేల ఎకరాల భూమిలో రాజ ధాని నిర్మించేందుకు రూ.43 వేల కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచినట్టు తెలిపారు. ఈ నెల 12 నుంచి ప‌నులు ప్రారంభం అవుతాయ‌ని వివ‌రించారు. వైసీపీ హ‌యాంలో ప‌నులు చేప‌ట్టి ఉంటే.. రాజ‌ధాని నిర్మాణాలు పూర్త‌య్యేవ‌ని తెలిపారు. కానీ, వైసీపీ ప్ర‌భుత్వం మూడుముక్క‌లాట ఆడ‌డంతో ప‌నులు ఆగిపోయి.. ఇప్పుడు భారం పెరిగిపోయింద‌ని తేల్చి చెప్పారు.