సాధారణంగా ఒక రాజకీయ పార్టీ విఫలమైతే.. ఆ పార్టీ నష్టపోవడమే కాదు.. ప్రత్యర్థి పార్టీలు కూడా బలోపేతం అవుతాయి. ఇప్పుడు ఏపీలోనూ అదే జరుగుతోంది. గత ఎన్నికల్లో 11 స్థానాలకే పరిమితమై వైసీపీ రాజకీయంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. అంతేకాదు.. రాజకీయ పతనావస్థలో చాలా జోరుగా జారుకుంటోంది. దీంతో ఈ పరిణామాలు.. కూటమి సర్కారుకు మేలు చేస్తున్నాయి. వాస్తవానికి వైసీపీ బలంగా ఉండి ఉంటే.. కూటమి పరిస్థితి వేరేగా ఉండేదని పరిశీలకులు చెబుతున్నారు. కానీ, జగన్ తనను తాను రక్షించుకోవడానికే ప్రాధాన్యం ఇస్తూ.. పార్టీ నాయకులను కూడా త్యజించడంతో వైసీపీ వైపు కన్నెత్తి చూసే నాయకులు కరువయ్యారు.
ఏమాటకు ఆ మాట చెప్పాల్సి వస్తే.. కూటమి పార్టీల్లో చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. కారణాలుఏవైనా.. కొందరు సీనియర్ నాయకులు తీవ్రంగా రగిలిపోతున్నారు. మంత్రులు తమ మాట వినడం లేదనో.. ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదనో.. ఇలా.. అనేక కారణాలు ఉన్నాయి. ఇక, తమకు ఎలాంటి కాంట్రాక్టులు దక్కడం లేదని భావిస్తున్నవారు కూడా ఉన్నారు. ఇలాంటి వారు ఎవరూ కూడా వైసీపీ వైపు చూడడం లేదు. కనీసం జగన్ పేరు కూడా ఎత్తడం లేదు. మంచైనా చెడైనా..కష్టమైనా.. నష్టమై నా.. టీడీపీలోనే అంటూ.. ఆ పార్టీ జెండానే మోస్తున్నారు.
అయితే.. ఇలా అనే వారిలో కొందరు మాత్రమే వీర విధేయులు. మరికొందరు జంప్ జిలానీలే ఉన్నారు. వారు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకమే. అయినప్పటికీ.. ఇప్పుడు మాత్రం ఎవరూ బయటకు రావడం లేదు. దీనికి కారణం.. వైసీపీ పుంజుకునే పరిస్థితిలో లేకపోవడంతోపాటు.. జగన్ ఫేస్ వాల్యూ తగ్గిపోయిందన్న చర్చ కూడా జోరుగా వినిపిస్తోంది. ఒకప్పుడు జగన్ అంటే.. చర్చించుకునే మహిళలు కూడా ఇప్పుడు దాదాపు ఆయన పేరును కూడా పలకడం లేదు. ఇక, వైసీపీ నాయకులు ఎక్కడికక్కడ కకావికలం అవుతున్నారు. పార్టీ తరఫున కార్యక్రమాలు చేసేవారు కూడా లేకుండా పోతున్నారు.
ఈ పరిణామాలతో కూటమి పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నాయకులు కూడా ఇక్కడే సర్దుకు పోతున్నారు తప్ప.. ఆల్టర్నేట్ కోసం ఆలోచన చేయడం లేదు. అంతేకాదు.. వైసీపీలోకి వెళ్లినా.. ప్రయోజనం లేదని, అది మునిగే నావ అని కొందరు వ్యాఖ్యానిస్తు న్నారు. అందుకే వైసీపీలోకి వెళ్లి చేతులు కాల్చుకునేందుకు సాహసం చేయడం లేదు. పైగా.. ఉన్న సింపతీ కూడా పోతుందన్న చర్చ కూడా నడుస్తోంది. సో.. మొత్తానికి జగన్ ఫేస్ వాల్యూ పడిపోయిందన్న చర్చల నేపథ్యంలో ఇక, ఎవరూ ముందుకు కదలక పోవడం గమనార్హం.