జనసేన… దేశ రాజకీయాల్లో నవ శకానికి నాందీ పలికింది. ఇప్పటిదాకా పోటీ చేసిన అన్ని సీట్లను గెలిచిన పార్టీ ఏపీలోనే కాదు… దేశంలోనే మరో పార్టీ లేదంటే అతిశయోక్తి కాదు. ఎన్నికల విజయాల్లోనే కాకుండా సమాజంపై తనకున్న బాధ్యతను గుర్తెరుగుతూ ఆ పార్టీ అధినాయకత్వం ఇప్పుడు ఓ సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఈ నెల 14న జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు పిఠాపురంలోని చిత్రాడలో జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఈ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతుండగా… పార్టీ ఆవిర్భావ సభ అనంతరం సభా ప్రాంగణంతో పాటుగా.. పరిసర ప్రాంతాలను శుభ్రం చేసే బాధ్యతను కూడా జనసేన తన భుజానికెత్తుకుంది. పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం వెల్లడించారు.
జనసేన ఆవిర్భవించి ఈ నెల 14కు 11 ఏళ్లు నిండుతున్నాయి. అదే సమయంలో పార్టీ మొన్నటి ఎన్నికల్లో ఘన విజయం సాధించి.. కూటమి విజయంలో కీలక భూమిక పోషించింది. దరిమిలా కూటమి సర్కారులో కీలక భాగస్వామిగానూ మారింది. స్వయంగా పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. పార్టీకి చెందిన నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ లకు మంత్రివర్గంలో కీలక శాఖలు దక్కాయి. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ పర్యావరణ, అటవీ శాఖలతో పాటుగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను కూడా పర్యవేక్షిస్తున్నారు. రోజువారీ పాలనలో పర్యావరణ పరిరక్షణకు పవన్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ సాగుతున్నారు.
ఇదే ఒరవడిని జనసేన ఆవిర్భావ సభలోనూ అమలు చేసిన తీరాలని ఆయన తీర్మానించారు. అధికార కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన నిర్వహిస్తున్న పార్టీ ఆవిర్భావ వేడుకలకు 10 లక్షల మందికి పైగానే హాజరు అవుతారని అంచనా. ఇంతమంది హాజరయ్యే సభ కారణంగా పర్యావరణానికి కొంతమేర ముప్పు వాటిల్లే ప్రమాదం లేకపోలేదు.
అయితే పర్యావరణాన్ని కాపాడుతూనే ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని పవన్ నిర్ణయించారు. ఆవిర్భావ సభ ఏర్పాట్లలో పర్యావరణానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా సభ ముగిసిన తర్వాత అక్కడ పేరుకుపోయే చెత్తా చెదారాన్ని శుభ్రం చేసే బాధ్యతను కూడా మనమే తీసుకోవాలని పవన్ తీర్మానించారు. ఇందుకోసం ఓ ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.
పవన్ ఆదేశాలకు అనుగుణంగా కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ అధ్యక్షతన.. స్థానికంగా ఉండే ఓ 25 మంది పార్టీ నేతలతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సభ ముగిసిన వెంటనే సభా ప్రాంగణంతో పాటుగా పరిసర గ్రామాల్లోనూ సభ కారణంగా పేరుకుపోయే చెత్తను తొలగించనుంది. ఇందులో పార్టీ జెండాలు, కరపత్రాలు, భోెజనానికి వినియోగించే ప్లేట్లు, గ్లాసులు, వాటర్ ప్యాకెట్లు, తదతరాలన్నింటినీ తొలగించి… ఆ ప్రాంతాన్ని సభ ముందు ఎలా ఉందో అలా మార్చేస్తుంది. నిజంగా… ఈ తరహా నిర్ణయంతో జనసేన నూతన ఒరవడికి శ్రీకారం చుట్టినట్టేనని చెప్పాలి.