తెలుగురాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన ప్రణయ్ హత్యకేసులో నల్లగొండ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2018లో మిర్యాలగూడలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా కుల వివక్షపై చర్చకు దారి తీసింది. ప్రణయ్ ను అతని భార్య అమృత కళ్ల ఎదుటే సుఫారీ గ్యాంగ్‌తో మారుతీరావు ప్లాన్ చేసి హత్య చేయించినట్లు విచారణలో తేలింది. న్యాయస్థానం ఈ కేసులో ప్రధాన నిందితుడు సుభాష్ శర్మ (ఏ-2) కు ఉరిశిక్ష విధించగా, మిగతా నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది.
ప్రణయ్, అమృత వివాహాన్ని అంగీకరించని ఆమె తండ్రి మారుతీరావు ఈ హత్యను పథకం ప్రకారం జరిపించినట్టు విచారణలో నిర్ధారణకు వచ్చింది. హత్యకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో 1600 పేజీల చార్జ్‌షీట్ రూపొందించబడింది. నిందితులుగా పేర్కొన్న ఎనిమిది మందిలో ప్రధాన కుట్రదారి మారుతీరావు (ఏ-1) 2020లో ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన నిందితులు సుబాష్ శర్మ, అజ్గర్ అలీ, అబ్ధుల్ బారీ, కరీం, శ్రవణ్ కుమార్, శివ, నిజాం విచారణ ఎదుర్కొన్నారు. న్యాయస్థానం సాక్ష్యాధారాలను పరిగణించి నిందితులకు కఠిన శిక్షలను ఖరారు చేసింది.
ఈ హత్య కేసులో నిందితులపై 302, 120B, 109, 1989 ఎస్సీ/ఎస్టీ చట్టాలు, భారతీయ ఆయుధాల చట్టం కింద అభియోగాలు నమోదయ్యాయి. హత్యకు పాల్పడిన వ్యక్తులు శిక్షను తగ్గించుకోవాలని న్యాయమూర్తిని కోరినా, కోర్టు వారిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ కఠినమైన తీర్పు ఇచ్చింది. హృదయ సంబంధిత సమస్యలు, కుటుంబ పరిస్థితుల కారణంగా శిక్షలో సడలింపు ఇవ్వాలన్న నిందితుల వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.
ప్రణయ్ హత్యకు కారణమైన కులపరమైన వివక్ష, కుటుంబ నిర్బంధ వ్యవస్థపై ఈ తీర్పు పలు చర్చలకు దారి తీసింది. సామాజిక న్యాయం, న్యాయవ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టేలా కోర్టు తీర్పు ఇచ్చిందని పలువురు అభిప్రాయపడ్డారు. హత్యకు పాల్పడిన వారిపై కఠిన శిక్షలు అమలు చేయడం ద్వారా భవిష్యత్తులో ఇటువంటి ఘటనలకు అడ్డుకట్ట వేయగలమనే సందేశాన్ని ఈ తీర్పు ఇచ్చిందని న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates