మొన్నటిదాకా ఇద్దరు పిల్లలు ముద్దు…అంతకు మించి వద్దు అనేది నినాదం. ఇప్పుడు ఎంత మంది వీలయితే అంత మంది పిల్లలను కనేయండి అనేది కొత్త నినాదం. అంతకంతకూ తగ్గిపోతున్న జనాభాను పెంచేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందుకున్న కొత్త నినాదం ఇది. ఈ నినాదాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు టీడీపీ సీనియర్ నేత, విజయనగరం ఎంపీ అప్పలనాయుడు మరో కీలక అడుగు వేశారు.
మీకు మూడో సంతానం ఉందా… అయితే రూ.50 వేలు తీసుకెళ్లండి అంటూ ఆయన తన నియోజకవర్గ ప్రజలకు సరికొత్త ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. ఎంపీగా పార్లమెంటులో తనదైన శైలితో దూసుకువెళుతున్న నాయుడు… నిత్యం వార్తల్లో ఉంటున్నారు. తాజాగా తన పార్టీ అధినేత ఇచ్చిన నూతన నినాదాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు అందరికంటే ముందుగా రంగంలోకి దిగి… మిగిలిన ప్రజా ప్రతినిధులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
దేశంలో ఉత్తరాది రాష్ట్రాల్లో పెద్దగా జనాభా తరుగుదల అయితే లేదు గానీ… దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం అనుకున్న దాని కంటే కూడా జనాభా పెరుగుదల మందగించింది. గతంలో కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల అమలులో దక్షిణాది రాష్ట్రాలు సత్తా చాటాయి. కోట్లాదిగా వేసెక్టమీ ఆపరేషన్లు చేసి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించారు. తీరా చూస్తే… ఇప్పుడు ఆ ఆపరేషన్ల ఫలితంగా జనాభా తగ్గిపోయింది. కొత్తగా పెళ్లి చేసుకుంటున్న జంటలు కూడా పరిమితంగానే పిల్లలను కంటూ సాగుతున్నారు. ఇందుకు సామాజిక, ఆర్థిక కారణాలు కూడా దోహదం చేస్తున్నాయి. ఇలాంటి క్రమంలో ప్రస్తుతం జరగబోతున్న డీలిమిటేషన్ లో జనాభా తగ్గిపోయిన ఫలితంగా దక్షిణాది రాష్ట్రాలు భారీగా నష్టపోతున్నాయి. ఈ పరిణామాలను ముందుగానే గమనించిన చంద్రబాబు జనాభా పెరుగుదలకు పకడ్బందీ చర్యలు ప్రారంభించారు.
చంద్రబాబు అడుగు జాడల్లో నడిచిన అప్పలనాయుడు… మూడో సంతానం కలిగిన దంపతులకు ప్రోత్సాహకాలను కూడా ప్రకటించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. అప్పలనాయుడు ప్రకటన ప్రకారం విజయనగరం పార్లమెంటు పరిధిలో మూడో సంతానం కలిగిన దంపతులకు రూ.50 వేల నగదు ప్రోత్సాహకాన్ని ఇవ్వనున్నారు. నగదు ప్రోత్సహకం వద్దనుకుంటే జంటలకు మూడో సంతానం ఆడ పిల్ల అయితే ఆవును, మగ పిల్లవాడు అయితే దూడను కూడా అందజేస్తానంటూ అప్పలనాయుడు ప్రకటించారు. ఈ ప్రకటన విజయనగరంలో కొత్త జంటలను అమితంగా ఆకట్టుకనే అవకాశం ఉందని చెప్పాలి. అదే సమయంలో ఏపీలోని మిగిలిన జిల్లాలు, దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలు కూడా అప్పలనాయుడు తరహాలో జనాభా పెరుగుదలకు ఈ తరహా ప్రోత్సాహకాలను ప్రకటించే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates