పురందేశ్వ‌రి సైలెంట్‌గా ప‌ని మొద‌లెట్టేశారా..!

కూట‌మి ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉన్న బీజేపీ త‌న‌ ప‌ని ప్రారంభిస్తోందా? సైలెంట్‌గా త‌న ఓటు బ్యాంకును పెంచుకునే ప్ర‌య‌త్నాలు చేస్తోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు రాష్ట్రంలోని క‌మ‌ల నాథులు. “కూట‌మి ప్ర‌భుత్వంలో ఉన్న‌ప్ప‌టికీ.. మ‌నం మ‌న పంథాను మ‌రిచిపోకూడ‌దు. పార్టీని బ‌లంగా క్షేత్ర‌స్థాయిలోకి తీసుకువెళ్లాలి. దీనికి స‌న్నంద్ధం కండి. ప్ర‌జ‌లను క‌ల‌వండి వారి స‌మ‌స్య‌లు తెలుసుకోండి” అని తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షురాలు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి పార్టీ నాయ‌కుల‌కు తేల్చి చెప్పారు.

అంటే.. క్షేత్ర‌స్థాయిలో పార్టీని డెవ‌ల‌ప్ చేసేందుకు బీజేపీ అధిష్టానం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. ఇప్ప‌టికే కేంద్రంలోని మోడీ స‌ర్కారు ఇస్తున్న సొమ్ముల‌తోనే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేస్తోందని పెద్ద ఎత్తున బీజేపీ నాయ‌కులు చెబుతున్నారు. కేంద్ర మంత్రుల నుంచి రాష్ట్ర మంత్రి స‌త్య‌కుమార్ వ‌ర‌కు.. ఇదే విష‌యాన్ని ఏ వేదిక ఎక్కినా చెబుతున్నారు. విశాఖ‌ప‌ట్నం ఉక్కు ఫ్యాక్ట‌రీకి రూ.11 వేల కోట్లు ఇచ్చిన విష‌యాన్ని ప్ర‌స్తావిస్తున్నారు.

అంతేకాదు.. రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణానికి ప్ర‌పంచ బ్యాంకు నుంచి ఇప్పించిన అప్పులు, పోల‌వ‌రం ప్రాజెక్టుకు ఇస్తున్న సొమ్ములు, బ‌డ్జ‌ట్‌లో ప్ర‌తిపాదించిన అంశాల‌ను కూడా బీజేపీ నాయ‌కులు ప్ర‌స్తావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు సొంత‌గా ఎదిగేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభిస్తున్నారు. అయితే.. ఇది సాధ్య‌మవుతుందా? కాదా? అనే విష‌యాలు ప‌క్క‌న పెడితే.. మొత్తానికి ప్ర‌య‌త్నం అయితే చేప‌డుతున్నారు. దీనివ‌ల్ల ఓటు బ్యాంకు పెరిగి.. తాము సొంతగా ఎదిగేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌న్న‌ది వాస్త‌వం.

ఎవ‌రికి న‌ష్టం?
రాష్ట్రంలో బీజేపీకి సొంత‌గా ఉన్న ఓటు బ్యాంకు 1 శాతంలోపే ఉంటుంది. కొన్నాళ్ల కింద‌ట చేప‌ట్టిన‌.. పార్టీ స‌భ్య‌త్వ‌ నమోదు కూడా పెద్ద‌గా పార్టీకి ఫ‌లించ‌లేదు. అనుకున్న రేంజ్‌లో స‌భ్య‌త్వాన్ని న‌మోదు చేయ‌లేక పోయారు. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యేందుకు మోడీ ఇమేజ్‌తోపాటు.. కేంద్రం ఇస్తున్న సాయాన్ని ప్ర‌స్తావిస్తూ.. పార్టీని క్షేత్ర‌స్థాయిలో బ‌లోపేతం చేసేందుకు ప్ర‌య‌త్నించ‌డంతో వైసీపీ ఓటు బ్యాంకుకు ప్ర‌ధాన స‌మ‌స్య ఎదుర‌య్యే అవ‌కాశం ఉంటుంద‌న్న చ‌ర్చ సాగుతోంది.

టీడీపీ ఓటు బ్యాంకు జోలికి వెళ్లినా.. జ‌న‌సేన ఓటు బ్యాంకు జోలికి వెళ్లినా.. ఆయా పార్టీల నాయ‌కులు బ‌లంగా ఉన్నారు కాబ‌ట్టి.. అది సాధ్యంకాదు. ఇక‌, మిగిలింది.. వైసీపీ, కాంగ్రెస్ ఓటు బ్యాంకే. సో.. ఈ రెండు పార్టీల‌కే గండి కొట్టే అవ‌కాశం ఉంటుంద‌న్న చ‌ర్చ ఉంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.