పార్టీ కోసం కష్ట పడే వారికే పదవులు దక్కుతాయి. పార్టీని నమ్ముకున్నవారికి ఎన్నటికీ అన్యాయం జరగదు. ఈ మాటలు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నోట నుంచి నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి. ఇటీవలి కాలంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ కూడా ఇదే మంత్రాన్ని జపిస్తున్నారు. వారిద్దరి మాటలకు అద్దం పడుతూ ఆదివారం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా విడుదల అయ్యింది. పార్టీ కోసం అహరహం శ్రమిస్తున్న బీటీ నాయుడు, బీద రవిచంద్ర, కావలి గ్రీష్మలకు ఎమ్మెల్సీ టికెట్ లను కేటాయిస్తున్నట్లు టీడీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది.
టీడీపీ టికెట్లను దక్కించుకున్న ఈ ముగ్గురిలో కావలి గ్రీష్మ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో అసెంబ్లీ తొలి మహిళా స్పీకర్ గా రికార్డులకెక్కిన కావలి ప్రతిభా భారతి కుమార్తెనే గ్రీష్మ. పార్టీకి చెందిన యువ నేతలతో లోకేశ్ ఏర్పాటు చేసిన ఓ బృందంలో గ్రీష్మ కీలక సభ్యురాలు. పార్టీ విధి విధానాలపై విస్పష్టతతో సాగుతున్న గ్రీష్మ… దాదాపుగా అన్ని వేదికల మీద పార్టీ వాయిస్ ను బలంగా వినిపించడంలో సత్తా చాటారనే చెప్పాలి. అప్పుడెప్పుడో టీడీపీ మహానాడు సందర్భంగా… వైరి వర్గంపైకి తొడ కొట్టి మరీ గ్రీష్మ చేసిన సవాల్ పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపిందని చెప్పాలి.
ఇక బీటీ నాయుడు విషయానికి వస్తే… పార్టీకి నమ్మిన బంటు. పార్టీ ఆదేశిస్తే ముందూ వెనుకా చూసుకునే రకం కాదు. పార్టీ కోసం ఏ పని చేయడానికి కూడా వెనుదీయని నేతగా నాయుడుకు గుర్తింపు ఉంది. కర్నూలు జిల్లాకు చెందిన ఈయనను లాగేందుకు ఇతర పార్టీలు లెక్కలేనన్ని యత్నాలు చేశాయి. అయితే తన జీవితంలో టీడీపీ తప్పించి మరో పార్టీకి స్థానం లేదని చెప్పిన నేతగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా… రాజ్యసభ సీటు దక్కినట్టే దక్కి చివరి నిమిషంలో చేజారింది. అయితే నాయుడు కష్టాన్ని గుర్తించిన చంద్రబాబు.. ఎమ్మెల్సీగా నాయుడుకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం ఈ నెలాఖరుకు నాయుడు సభ్యత్వ ముగుస్తుండగా… ఆయన సీటును చంద్రబాబు తిరిగి ఆయనకే కేటాయిచారు.
బీద రవిచంద్ర కూడా పార్టీకి వీర విధేయుడే. పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న బీద మస్తాన్ రావు సోదరుడే రవిచంద్ర. రాజకీయ అవసరాలో, వ్యాపార కారణాలో తెలియదు గానీ.. బీద మస్తాన్ రావు పార్టీలు మారినా… రవి చంద్ర మాత్రం టీడీపీ చేతిని వదలలేదు. గతంలో ఓసారి టీడీపీని వీడి మస్తాన్ రావు వైసీపీలో చేరారు. ఆయనతో పాటు రవిచంద్ర కూడా పార్టీ మారతారన్న వార్తలే వెలువడలేదు. కారణమేమిటంటే… కుటుంబం కంటే కూడా టీడీపీకే రవిచంద్ర విలువ ఇస్తారన్న మాట అందరికీ తెలిసిందే కాబట్టి.. ఆ ప్రచారం జరగలేదు. మొత్తంగా మొత్తం 5 సీట్లలో ఓ సీటును జనసేనకు, మరో సీటును బీజేపీకి కేటాయించిన టీడీపీ… తన ఖాతాలోని మూడు సీట్లను పార్టీకి వీర విధేయులుగా ఉన్న నేతలకు ఇచ్చి… వారి కష్ఠాన్ని గుర్తించిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.