జాబితా బారెడు.. ప‌ద‌వులు మూరెడు..

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆప‌శోపాలు ప‌డుతోంది. ఎవ‌రిని ఉంచాలి.. ఎవ‌రి తుంచాలి.. అనే విష‌యంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న ఒక కొలిక్కి రావ‌డం లేదు. ఎక్క‌డా కూడా ముడి ప‌డ‌డం లేదు. ఈ వ్య‌వ‌హారం ఏకంగా ఏఐసీసీ చేతికి చేరిన‌ప్ప‌టికీ.. ఆది క‌నిపిస్తున్నంత తేలిక‌గా.. అంతం క‌నిపించ‌డం లేదు. దీంతో నాయ‌కులు ఆప శోపాలు ప‌డుతున్నారు. విష‌యం ఏంటంటే.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

మొత్తం 5 స్థానాల‌ను భ‌ర్తీ చేయాల్సి ఉంటుంది. అయితే.. వీటిలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంఖ్యా బలం ప్ర‌కారం.. 3 నుంచి నాలుగు స్థానాలు ద‌క్క‌నున్నాయి. ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగానే ఈ సీట్లు ద‌క్క‌నున్నాయి. అయితే.. ఈ ముడు, లేదా నాలుగు స్థానాల‌ను ఎవ‌రితో భ‌ర్తీ చేయాల‌న్న విష‌యం పార్టీకి సంక‌టంగా మారింది. మ‌రోవైపు.. ఈ నెల 10తో(సోమ‌వారం) నామినేష‌న్ల ఘ‌ట్టం పూర్తి కానుంది.

కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌లేదు. ఇక‌, జాబితా విష‌యానికి వ‌స్తే.. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీల నుంచి నాయ‌కులు పోటీ ప‌డుతున్నారు. వీరిలోనూ ఇటీవ‌లే బీసీ గ‌ణ‌న చేసిన ప్ర‌భుత్వం వారికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని భావిస్తోంది. ఇదే జ‌రిగి.. రెండు స్థానాల‌ను వారికి కేటాయిస్తే.. త‌మ‌కు ఒక్క‌టేనా ఇచ్చేద‌ని ఓసీ, ఎస్సీ వ‌ర్గాలు భావిస్తాయి. పోనీ.. మూడు సామాజిక వ‌ర్గాల‌కు మూడు కేటాయించినా నాయ‌కుల మ‌ధ్య అసంతృప్తి రాజ్య‌మేలు తుంది.

ఈ నేప‌థ్యంలో పార్టీ అధిష్టానం నానా తిప్ప‌లు ప‌డుతోంది. ఇక‌, పోటీలో ఉన్న వారిని గ‌మ‌నిస్తే.. న‌రేంద్ర రెడ్డి, కుసుమ కుమార్‌, రావా కుమార్ ఓసీ కోటాలో బ‌లంగా పోటీ ప‌డుతున్నారు. వీరిలో ఎవ‌రికి ఇచ్చిన‌.. మ‌రో ఇద్ద‌రు యాంటీ అయ్యే అవ‌కాశం ఉంద‌న్న చ‌ర్చ ఉంది. అదేవిధంగా బీసీ కోటాలో ఇర‌ప‌త్రి అనిల్‌, కొన‌గాల మ‌హేష్‌, జైపాల్‌, సీఎం రేవంత్కు స‌న్నిహితుడిగా పేరున్న గాలి అనిల్ పేర్లు వినిపిస్తున్నాయి. అదేవిధంగా అద్దంకి ద‌యాక‌ర్‌.. త‌న‌కు సీటు ఖాయ‌మ‌ని, ఎస్సీ కోటాలో మండ‌లిలో అడుపెడ‌తాన‌ని అంటున్నారు. జ్ఞాన సుంద‌ర్‌, దొమ్మ‌డి సాంబయ్య‌లు కూడా ఈ కోటాలోనే పోటీ ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఎవ‌రిని ఎంపిక చేయాల‌న్న‌ది అధిష్టానానికి ఇబ్బందిగానే మారింద‌ని చెప్పాలి.