రాష్ట్రంలో మహిళా ఓటు బ్యాంకు ఎక్కువగా ఉందన్న విషయం తెలిసిందే. నగరాలు, పట్టణాలే కాదు.. గ్రామీణ స్థాయిలోనూ మహిళల ఓటు బ్యాంకు 2026 నాటికి 20-30 శాతం మేరకు పెరుగుతుందన్న అంచ నాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలూ.. మహిళలకు ఎనలేని ప్రాదాన్యం ఇస్తున్నాయి. దీనిలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి సర్కారు మరింత ఎక్కువగా మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ.. వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుండడం మరో విశేషం.
మహిళా పారిశ్రామిక వేత్తలకు పెద్దపీట వేస్తున్న చంద్రబాబు సర్కారు వచ్చే ఏడాది నాటికి రాష్ట్రంలో లక్ష మంది మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముందుకు సాగుతోంది. వీరికి స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడం నుంచి పారిశ్రామికంగా.. పరిశ్రమల స్థాపన వరకు.. అన్ని రంగాల్లోనూ చేదోడుగా నిలుస్తోంది. డ్వాక్రా సంఘాలను మరింత బలోపేతం చేయడంలోనూ.. సర్కారు దూకుడుగా ఉంది. తద్వారా స్వయం సహాయక సంఘాలను డెవలప్ చేయడంలోనూ సర్కారు దీర్ఘకాల లక్ష్యాలతో ముందుకు సాగుతోంది.
ప్రభుత్వ పరంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలోనూ కూటమి ముందు చూపుతో వ్యవహరిస్తోంది. మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ.. ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్లను ప్రొవైడ్ చేసిన ప్రభుత్వం.. దీనిని వచ్చే నాలుగు సంవత్సరాల పాటు కొనసాగించనుంది. ఇది మహిళలకు.. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఎంతో మేలు చేస్తున్న విషయం తెలిసిందే. అదేవిధంగా సామాజిక భద్రతా పింఛన్లు తీసుకునేవారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. వారికి కూడా పెంచిన పింఛను మరింత మేలు చేస్తోంది.
ఇక, త్వరలోనే.. తల్లికి వందనం పేరుతో అమలు చేయనున్న కీలక పథకం కూడా.. మహిళలకు వరంగా మారనుంది. ఈ పథకం కింద ఎంత మంది పిల్లలు ఉంటే.. అన్ని రూ.15000 చొప్పున మహిళల ఖాతాల్లో జమ చేయనున్నారు. తద్వారా.. వారి జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసరించనున్నాయి. ఇక, స్థానిక పదవుల్లోనూ.. నామినేటెడ్ పదవుల్లోనూ త్వరలోనే మహిళలకు 33 శాతం పదవులు ఇవ్వాలన్న చంద్రబాబు నిర్ణయం కూడా అమలైతే.. ఇక, కూటమిసర్కారు వెంటే మహిళలు ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.