నారా లోకేష్ పై కేసా ?

తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివీడు, అత్తిలి, చినపరిమి మండలాల్లో లోకేష్ పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించటం, రైతులతో మాట్లాడటం కోసం పర్యటించిన లోకేష్ తో పాటు ఎంఎల్ఏలు రామానాయుడు, శివరామరాజు తదితరులు పాల్గొన్నారు.

ఇద్దరు ఎంఎల్ఏతో కలిసి ఆకివీడులో నుండి సాద్ధాపురంకు లోకేష్ ట్రాక్టర్లో బయలుదేరారు. ట్రాక్టర్లో ఎంఎల్ఏలే కాకుండా చాలామంది నేతలు కూడా ఎక్కారు. ఈ ట్రాక్టర్ ను స్వయంగా లోకేషే నడిపారు. రోడ్డంతా పూర్తిగా వరదనీటితో నిండిపోవటంతో ట్రాక్టర్ నడపటం లోకేష్ వల్ల కాలేదు. చినకాపవరం దగ్గరకు వచ్చేసరికి ట్రాక్టర్ అదుపు తప్పి పక్కనే ఉన్న డ్రైన్లోకి వెళ్ళిపోయింది. అయితే చివరి నిముషంలో పక్కనే ఉన్న మంతెన శివరామరాజు ట్రాక్టర్ ను అదుపు చేయటంతో పెద్ద ప్రమాదం తప్పింది.

లోకేష్ పర్యటనలో ఉన్న పోలీసులు ఇదే విషయాన్ని పై అధికారులకు వివరించారు. వాళ్ళ ఆదేశాల ప్రకారం లోకేష్ పై కేసు నమోదు చేశారు. ట్రాక్టర్ అదుపుతప్పినందుకు కారణమైన లోకేష్ పై కేసు నమోదైంది. పనిలో పనిగా కరోనా వైరస్ నేపధ్యంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు కూడా ప్రధాన కార్యదర్శితో పాటు మరికొందరిపైన కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నేతలు తమ పర్యటనల్లో ఇతరుల కోరిక వల్లో లేక తమ అత్యుత్సాహం వల్లో ట్రాక్టర్ల లాంటివి నడపటం సహజమే. ఇక్కడ కూడా అదే జరిగుంటుంది. వాతావరణ ప్రభావం ట్రాక్టర్ అదుపుతప్పింది వాస్తవమే. అయితే చివరి నిముషంలో ప్రమాదం తప్పిపోయింది. ఇక కరోనా వైరస్ నేపధ్యంలో కేసులు పెట్టడం కూడా అంత సబబుగా లేదు.

ఎందుకంటే కేంద్రమే అనేక సడలింపులు ఇస్తోంది. జగన్మోహన్ రెడ్డి పర్యటనలు, మంత్రుల పర్యటనల్లో కూడా జనాలు విపరీతంగా పాల్గొంటున్నారు. ఇక ప్రధానమంత్రి, కేంద్రమంత్రుల పర్యటనల్లో కూడా చాలామందే పాల్గొంటున్నారు. వాళ్ళందరి పర్యటనల్లోను అడ్డంకానీ, నమోదుకానీ కరోనా నిబంధనలను పోలీసులు ఒక్క లోకేష్ పర్యటనలో చూపుతుండటమే విచిత్రంగా ఉంది.