ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన ఆవిర్భవించి ఈ నెల 14కు 11 ఏళ్లు పూర్తి కానుంది. ఈ క్రమంలో పవన్ ను ఎమ్మెల్యేగా గెలిపించిన పిఠాపురం ప్రజల సమక్షంలో ఈ నెల 14న జనసేన ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. ప్రస్తుతం పార్టీ అధికారంలో ఉండటంతో ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నట్లు సమాచారం. ఇందుకోసం పిఠాపురం పరిధిలోని చిత్రాడలో ఆవిర్భావ వేడకలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ వేడుకలకు సంబంధించి పార్టీలోని దాదాపుగా ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేస్తూ సాగుతున్న తీరు ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఇప్పటికే పార్టీ ఆవిర్భావ సభ నిర్వహణకు సంబంధించిన పలు కమిటీలను పవన్ కల్యాణ్ ప్రకటించారు. అందుబాటులోకి వస్తున్న మరింత మంది నేతలను ఆయా కమిటీల్లోకి జత చేస్తూ సాగుతున్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ సారథ్యంలో ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ అయితే ఈ ఏర్పట్లలో నిండా మునిగిపోయారు. సభ ఏర్పాట్లకు సంబంధించి జరుగుతున్న ప్రతి చిన్న పనిని కూడా ఆయన దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు, కింది స్థాయి కార్యకర్తలు అంతా ఈ ఏర్పాట్లలోనూ మునిగిపోయారు. ఫలితంగా పిఠాపురంలో పండుగ వాతావరణం నెలకొంది.
తాజాగా శనివారం జనసేన ఆవిర్భావ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను నిత్యం పర్యవేక్షించేందుకు ఏకంగా కంట్రోల్ రూం అందుబాటులోకి వచ్చింది. పిఠాపురంలో ఈ కంట్రోల్ రూంను నాదెండ్లతో కలిసి ఉదయ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ ఏర్పాట్ల తీరు చూస్తుంటే.. నిజంగానే జనసేన ఆవిర్భావ వేడకలు ఏ రేంజిలో జరుగుతాయన్న అంశం అసలు ఊహకే అందట్లేదు. ఎన్నికల్లో జనసేన 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించడం, పవన్ చట్టసభల్లోకి అడుగుపెట్టడతోనే డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తీరుతో పార్టీ శ్రేణులు ఉరిమే ఉత్సాహంతో ఉన్నారు. ఫలితంగా ఈ సభకు 10 లక్షలకు మించిన జనం హాజరైనా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్న వాదన వినిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates










