భారత ఎన్నికల సంఘం (EC) ఓటర్ ఐడీ కార్డుల డూప్లికేట్ నంబర్ల సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా 99 కోట్లకు పైగా ఓటర్లు ఉండటంతో, భారత ఎన్నికల జాబితా ప్రపంచంలోనే అతిపెద్ద డేటాబేస్‌గా ఉంది. అయితే, చాలా సంవత్సరాలుగా ఓటర్ కార్డుల డూప్లికేట్ నంబర్ల సమస్య కొనసాగుతోంది. ఉదాహరణకు గ్రామాల నుంచి వచ్చి సిటీలో ఉన్న వారు రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉండడమే కాకుండా రెండు సార్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు అనేలా ఆరోపణలు వచ్చాయి.
కొందరి ఓటర్ కార్డుల సంఖ్యలు రెండుసార్లు నమోదు కావడం వల్ల ఎన్నికల సమయంలో సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యను పూర్తిగా తొలగించేందుకు ఎన్నికల సంఘం మూడు నెలల్లో యూనిక్ ఓటర్ ఐడీ నంబర్ వ్యవస్థను తీసుకురాబోతోంది. ఈ అంశంపై పలు రాజకీయ పార్టీల నుంచి విమర్శలు వచ్చాయి, ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎన్నికల సంఘంపై కవరప్ చేస్తున్నట్లు ఆరోపించింది. అయితే, ఈ సమస్యను త్వరలోనే పరిష్కరించబోతున్నట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.
ఈ సమస్య చాలా కాలం నుంచి కొనసాగుతోంది, ఇక దాని పరిష్కారానికి ప్రయత్నాలు ప్రారంభమవుతున్నాయి. డూప్లికేట్ ఓటర్ కార్డులున్నా, ఓటింగ్ హక్కు మాత్రం ఓటర్ పేరు నమోదు అయిన పోలింగ్ బూత్‌లో మాత్రమే ఉంటుందని EC స్పష్టం చేసింది. కానీ, ఓటర్ ఐడీ నంబర్ల సమస్య ఓటింగ్ సమయంలో కొన్ని చోట్ల గందరగోళానికి కారణమవుతోంది. దీనికి పరిష్కారంగా, ప్రతి ఓటరుకు యూనిక్ నేషనల్ EPIC నంబర్ (Electoral Photo Identity Card Number) కేటాయించాలని నిర్ణయించారు.
ఈ కొత్త విధానం ద్వారా ప్రస్తుతం ఉన్న డూప్లికేట్ ఓటర్ల గుర్తింపు నంబర్లను తొలగించి, వారికి కొత్త యూనిక్ నంబర్లు ఇవ్వనున్నారు. దీనితో పాటు భవిష్యత్తులో కొత్త ఓటర్లకు కూడా ప్రత్యేకంగా ఒకే ఒక నంబర్ ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారులతో కలిసి, టెక్నికల్ టీమ్ దీనిపై ప్రత్యేకంగా పని చేస్తోంది. దీని ద్వారా ఓటర్ల లిస్టులో స్పష్టత వస్తుందని, డూప్లికేట్ ఓటింగ్‌కు తావు ఉండదని EC చెబుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates